గాజా స్ట్రిప్ ప్రాంతంలోని సుమారు 11లక్షల
మంది ప్రజలు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. 24
గంటలలోగా దక్షిణ దిక్కుగా వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ మిలటరీ డిమాండ్ చేసింది.
దాన్నిబట్టి, గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఇజ్రాయెల్ భీకరమైన ప్రత్యక్ష యుద్ధం
ప్రారంభిస్తుందన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరం సరిహద్దుల
వద్దకు యుద్ధట్యాంకులను తీసుకువెళ్ళి మోహరిస్తోంది. ఆ క్రమంలోనే గాజా పౌరులను నగరం
వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘గాజా పౌరులారా, మీ వ్యక్తిగత
రక్షణ కోసం, మీ కుటుంబాల భద్రత కోసం, దక్షిణానికి తరలిపొండి. మిమ్మల్ని మానవ
కవచంగా వాడుకుంటున్న హమాస్ ఉగ్రవాదులకు దూరంగా వెళ్ళిపోండి. రాబోయే రోజుల్లో మా
బలగాలు గాజా ప్రాంతం నుంచి క్రియాశీలంగా పనిచేస్తాయి. అయితే సాధారణ పౌరులకు హాని
కలిగించకూడదని భావిస్తున్నాం’’ అని హెచ్చరించింది. గాజా స్ట్రిప్ తూర్పు, ఉత్తర
దిశల్లో ఇజ్రాయెల్‌తో సరిహద్దులు కలిగి ఉంది.
ఇజ్రాయెల్ ఆదేశాలు విధ్వంసకర పరిణామాలకు
దారితీస్తాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. సాధారణ ప్రజల ప్రాణాలు పోకూడదన్నది
సరైన ఆలోచనే అయినా, రాత్రికి రాత్రి వారిని తమ నెలవులను వదిలిపెట్టి పొమ్మని
ఆదేశించడం విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్
ఆదేశాల వల్ల తమ సిబ్బందికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి
గుర్తించింది. ఐరాస నడుపుతున్న బడులు, ఆస్పత్రుల్లో తలదాచుకుంటున్న వారికి కూడా ఆ ప్రమాదం
పొంచివుంది. అందుకే ఐక్యరాజ్యసమితి తమ కార్యకలాపాలను దక్షిణ గాజాకు మార్చేసింది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ
బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌ను సందర్శించారు. ప్రధాని
బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన బ్లింకెన్, అమెరికా మద్దతు ఇజ్రాయెల్‌కేనని
స్పష్టంగా ప్రకటించారు. బులెట్లు తగిలి చనిపోయిన చిన్నారులు, సైనికుల తలలు నరికివేసిన
దారుణ దృశ్యాల చిత్రాలను చూసి బ్లింకెన్ చలించిపోయారు. హమాస్ దాడుల కారణంగా
ఇజ్రాయెల్‌లో చనిపోయిన వారిలో 22మంది తమ దేశస్తులు ఉన్నారని అమెరికా వెల్లడించింది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై నేటికి
వారం కావస్తున్నప్పటికీ మధ్యప్రాచ్యంలో శాంతి కనుచూపుమేరలో కనిపించడం లేదు. గత
శనివారం మొదలైన యుద్ధంలో 1200 మంది ఇజ్రాయెల్‌లోనూ, 1400 మంది గాజాస్ట్రిప్‌లోనూ
హతులయ్యారు. వారికి తోడు, ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకువెళ్ళిన 1500 మంది హమాస్
మిలిటెంట్లను హతమార్చినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ భూభాగం నుంచి హమాస్ ఉగ్రవాదులు
బలవంతంగా తీసుకువెళ్ళిన 150 మంది ఇంకా ఉగ్రవాదుల అధీనంలోనే ఉన్నారు.
హమాస్ దాడులు మొదలైన వెంటనే గాజాస్ట్రిప్‌పై
ఎదురుదాడి మొదలుపెట్టిన ఇజ్రాయెల్, ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టింది. గాజా ప్రాంతానికి తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాలను
నిలిపివేసింది. తమ దేశం నుంచి బందీలుగా తీసుకువెళ్ళినవారిని విడిచిపెట్టే వరకూ
గాజా ప్రాంతానికి ఎలాంటి మానవతాసహాయమూ అందనివ్వబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
మరోవైపు… లెబనాన్,
సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా
ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యాన్ని లక్ష్యం చేసుకున్నారు. దాంతో ఇజ్రాయెల్, సిరియాకు చెందిన డమాస్కస్,
అలెప్పో విమానాశ్రయాలపై శుక్రవారం ముమ్మరంగా దాడులు చేసింది. ఆ ఎయిర్‌పోర్ట్‌లలో
ఎక్కడి విమానాలను అక్కడే నిలిపేయాల్సి వచ్చింది. ఆ రెండు విమానాశ్రయాలూ పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇరాన్ మద్దతుతో తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న లెబనాన్‌కు చెందిన
హిజ్బుల్లా ఉగ్రవాదులపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. వారిపైకి కాల్పులు జరిపింది.