పాలక
వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య పరస్పర రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణల జాబితాలో
మరోకొత్త అంశం చేరింది. నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్
జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి.
కుంభకోణాల ఆరోపణలు, ప్రత్యారోపణల స్థానంలో ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యం విషయం వచ్చిపడింది.
చంద్రబాబును
భౌతికంగా అంతమొందించేందుకు పాలకపార్టీ కుట్రలు చేస్తోందని అందుకు అనుగుణంగా
వ్యవస్థలను మేనేజ్ చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు ద్వారా
ఎదురయ్యే ప్రతికూలతను పక్కదారి పట్టించేందుకు టీడీపీనే చౌకబారు ప్రచారం చేస్తోందని
వైసీపీ బదులిస్తోంది.
ప్రజాధనాన్ని
దారి మళ్ళించి సొమ్ము చేసుకున్నారని ఆ విషయం బయటపడటంతో టీడీపీ దిగజారి
వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు.
ఆధారాలు
లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టారని అక్కడ ఆయన ఆరోగ్యం
దెబ్బతీసి అంతమొందించే కుట్రలు జరుగుతున్నాయని నారా కుటుంబం చెబుతుండగా టీడీపీ సహా
ఇతర పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. చంద్రబాబుకు జైల్లో సరైన వసతులు కల్పించడం
లేదని కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు సతీమణి
చెబుతున్నారు.
జైలు జీవితం కారణంగా చంద్రబాబు, ఐదు కేజీల బరువు తగ్గారని, మరింత
తగ్గితే కిడ్నీలు సహా ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన
చెందుతున్నారు.
తీవ్రమైన
ఉక్కపోతతో చంద్రబాబుకు డీహైడ్రేషన్ సమస్యలు, స్కిన్ అలర్జీ వచ్చాయి. దీంతో జైలు
అధికారులు ఆయన వైద్యం అందజేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ట్రీట్మెంట్ పేరిట
స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. అక్రమ అరెస్టు
కేసులో తన తండ్రిని నిర్బంధించి వేధిస్తున్నారని ఆవేదన చెందారు.
నారా
కుటుంబం, టీడీపీ నేతల ప్రకటనలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందని
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు పలికిన
సజ్జల… చంద్రబాబు అవినీతిని డైవర్ట్ చేయడానికే టీడీపీ డ్రామాలు ఆడుతోందని
నిప్పులు చెరిగారు. నిబంధనల ప్రకారమే జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని, కోర్టు
ఆదేశాలు పాటిస్తున్నారని వివరించారు.
సకల సౌకర్యాలు కల్పించడానికి జైలేమీ
అత్తగారిల్లు కాదని చురకలు అంటించారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని దర్యాప్తు
సంస్థలే స్కిల్ కుంభకోణాన్ని వెలికితీశాయన్నారు. చర్మవ్యాధిని కూడా ప్రాణాంతకం
చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి భోజనమే తింటున్నప్పుడు బరువు ఎందుకు
తగ్గుతున్నారని ప్రశ్నించారు. వాతావరణం మారుతున్నప్పుడు వచ్చే సమస్యలు చంద్రబాబుకు
వస్తున్నట్లు ఉన్నాయని వాటిని ఆయన భరించాల్సిందే అన్నారు.
చంద్రబాబు
ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదని జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. అన్నీ
నియంత్రణలోనే ఉన్నాయన్నారు. జైళ్లలో ఏసీల ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
అన్నారు. చంద్రబాబు జైలులోకి వచ్చిన మొదటి రోజు 66 కేజీల బరువు ఉండగా ప్రస్తుతం
ఆయన 67 కేజీలున్నారన్నారు.