తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేసారు. ఆ మేరకు కాంగ్రెస్
జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపించారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు
ప్రాధాన్యం ఇవ్వడం లేదని పొన్నాల ఆరోపించారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందనీ, తనకు అవమానం జరిగిందనీ ఆయన
మండిపడ్డారు. సొంత పార్టీలోనే తమను పరాయివారిగా పరిగణిస్తున్నారంటూ ఆవేదన చెందారు.
అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పొన్నాల తన లేఖలో
పేర్కొన్నారు.
రెండు పేజీల సుదీర్ఘ లేఖలో పొన్నాల
లక్ష్మయ్య పలు విషయాలను ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి
పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వేల పేరుతో బీసీలకు సీట్లు ఎగ్గొట్టే కుట్ర
జరుగుతోందని ఆరోపించారు.
పొన్నాల లక్ష్మయ్య జనగామ శాసనసభ
నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ జనగామ
టికెట్‌ను కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఇస్తారనే అంచనాలున్నాయి. ఆ అసంతృప్తితోనే
పొన్నాల పార్టీని విడిచిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్
వైపు చూస్తున్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ అధినేత కె
చంద్రశేఖరరావు సమక్షంలోనే పొన్నాల బీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ కూడా జనగామ అసెంబ్లీ టికెట్ పొన్నాలకు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని
సమాచారం.