ప్రపంచంలో
ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా అది మానవత్వానికి వ్యతిరేకమేనని ప్రధాని మోదీ
అన్నారు. ఉమ్మడి ప్రయాణంలో శాంతి,
సోదరభావంతో కలిసిమెలిసి ముందుకు సాగాలన్నారు.
వివాదాలు,
సంఘర్షణలు ఎక్కడున్నా అవి మొత్తం ప్రపంచం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయే కానీ ఏ
ఒక్కరికీ మేలు చేయవన్నారు.
మానవత్వమే కేంద్రంగా ముందుకు సాగాలని ప్రపంచానికి
పిలుపునిచ్చారు.
న్యూదిల్లీలో
జరిగిన జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, ప్రపంచ
నమ్మకాన్ని గెలుచుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించాల్సిన బాధ్యత అందరిపై
ఉందన్నారు.
ప్రపంచమంతా
శాంతి, సోదరభావంతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న ప్రధాని, ఇజ్రాయెల్-హమాస్
మధ్య భీకరదాడుల ప్రభావం మొత్తం ప్రపంచంపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సరిహద్దుల
అవతలి నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులతో వేలమంది అమాయక భారతీయులు బలయ్యారన్నారు.
20 ఏళ్ళ కిందట భారత్ పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిని ఆయన గుర్తు చేశారు.
ఉగ్రవాదం
కారణంగా ఎదురయ్యే సవాళ్ళు ఇప్పుడిప్పడే ప్రపంచానికి అర్థం అవుతున్నాయన్న మోదీ, ఉగ్రవాదం
ఎక్కడున్నా వారి కార్యాచరణ ఏమైనప్పటికీ అది మానవత్వానికి వ్యతిరేకం అన్నారు. ఉగ్రవాదాన్ని
రూపుమాపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అందరూ కలిసికట్టుగా ఆలోచన చేయాలని
సూచించారు.
వచ్చే
ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో వందకోట్ల మంది భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని,
ఆ ఘట్టాన్ని చూసేందుకు పీ20 ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
భారత్ లో
ఇప్పటి వరకు 17 సాధారణ ఎన్నికలు, 300 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, తమపార్టీ
కేంద్రంలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద
ఎన్నికల సంగ్రామం అన్నారు.
జీ-20
దేశాల పార్లమెంట్ స్పీకర్లతో పాటు ఆతిథ్యదేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో
పాల్గొన్నారు. జీ20లో ఇటీవలే చేరిన ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధి ఈ సమావేశానికి
మొదటిసారి హాజరయ్యారు.