సుగుణాభి రాముడి జన్మస్థలమైన
అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు గవర్నర్లు, ముఖ్యమంత్ర్రులు, ఇతర
వీఐపీ హోదా ఉన్న వ్యక్తులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
కోరింది. ప్రముఖులకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేసే అవకాశం లేనందున ఈ మేరకు
అభ్యర్థిస్తున్నామని తెలిపింది.
స్థానిక యంత్రాంగం కూడా ప్రోటోకాల్ పాటించే
పరిస్థితి లేదని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర
మోదీ ఆరోజు అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది.
ప్రాణప్రతిష్ఠ రోజుకు బదులు
ఆయా రాష్ట్రాల భక్తులు వచ్చే రోజు అయోధ్యను దర్శించేలా ప్లాన్ చేసుకోవాలని ట్రస్టు
కోరింది.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
తర్వాత జనవరి 26 నుంచి ఫిబ్రవరి 22 వరకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు దశలవారీగా
రాముడిని దర్శించి పూజలు చేసుకునే అవకాశం కల్పించారు.
రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్
నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. దీంతో జనవరి 22న ప్రారంభోత్సవం ఉంటుంది.
మూడు దశల్లో నిర్మిస్తున్న రఘునందనుడి
ఆలయం 2025 జనవరి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
రోజులో 12 గంటల పాటు భక్తుల
దర్శనానికి అనుమతిస్తే రోజుకు 70 వేల నుంచి 75 వేల మంది సులువుగా దర్శించుకుంటారని
అయోధ్య రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. 160 స్తంభాలపై గ్రౌండ్
ఫ్లోర్ నిర్మాణం జరుగుతుండగా ప్రతీ స్తంభంపై రామ చరితను సూచించే 25 శిల్పాలు
చెక్కుతున్నట్లు వివరించారు.
2020 ఫిబ్రవరి 5 నుంచి 2023
మార్చి 31 వరకు మందిర నిర్మాణానికి గాను రూ. 900 కోట్లు ఖర్చు చేశారు. బ్యాంకు
ఖాతాల్లో ఇంకా రూ.3 వేల కోట్ల నగదు నిల్వ ఉందన్నారు.
భవ్య రామమందిరంలో సూర్య
వంశోద్ధారకుడైన రఘురాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా నివాసాల ముందు
సంధ్యా సమయంలో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. అలాగే 5 లక్షల గ్రామాలకు శ్రీరాముడి
అక్షతలు పంపాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.