మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను
వెనక్కు తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. అందులో
భాగంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి ప్రత్యేక విమానం ఒకటి ఇవాళ తెల్లవారుజామున
ఢిల్లీ చేరుకుంది.
ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా మాతృభూమికి
చేరుకున్న భారతీయులకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
స్వాగతం పలికారు. హమాస్ దాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్ నుంచి క్షేమంగా స్వదేశానికి
చేరుకున్న భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి విడతలో 212మందిని భారత్
తీసుకొచ్చారు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్లో ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్’ పద్ధతిలో
వీరిని వెనక్కి తీసుకొచ్చారు. వీరిలో కొంతమంది విద్యార్ధులు కూడా ఉన్నారు. ఢిల్లీ
ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన వారు ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు
చేసారు.
భారత రాయబార కార్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం
ఇజ్రాయెల్లో సుమారు 18వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో దాదాపు 14వేల
మంది కేర్టేకర్లే. వీరితోపాటు విద్యార్థులు, ఐటీ
ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు తదితరులున్నారు. వీరిని
వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్ ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. వీరి ప్రయాణ
ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
‘‘మేం భారతదేశానికి సదా కృతజ్ఞులమై ఉంటాం. చాలామంది విద్యార్ధులు కొంతవరకూ కంగారు పడుతున్నారు.
ఉన్నట్టుండి మాకు నోటిఫికేషన్ వచ్చింది. భారత ఎంబసీ నుంచి ప్రతీ భారతీయ పౌరుడికీ
సమాచారం వచ్చింది. అది ముందు మాలో ధైర్యం నింపింది. దౌత్యకార్యాలయం మమ్మల్ని
కాచుకుంటోందన్న భావన మాకు చాలా ఊరట కలిగించింది. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లూ
జరిగిపోయాయి’’ అని శుభం కుమార్ అనే విద్యార్ధి వివరించాడు.
‘‘ఆ రోజు ఎయిర్ రెయిడ్
సైరన్ల మోతతో నిద్రలేచాం. ఏం జరుగుతోందో తెలిసేలోగానే కొన్నిచోట్ల రాకెట్లు వచ్చి పడ్డాయి.
ఇజ్రాయెల్ అధికారులు మమ్మల్ని దగ్గరలోని షెల్టర్లలో తలదాచుకోమన్నారు. మేం ఇక్కడికి
బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ మోత మా చెవుల్లో మార్మోగుతూనే
ఉంది. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం. మమ్మల్ని క్షేమంగా స్వదేశానికి
తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని మరో ప్రయాణికుడు చెప్పాడు.