హమాస్ ఉగ్రవాదులు తమ దేశం నుంచి కిడ్నాప్
చేసిన తమ పౌరులను వదిలిపెట్టేవరకూ గాజా స్ట్రిప్ ప్రాంతానికి ఎలాంటి మౌలిక వనరులనూ
అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. కనీసం మానవతా సహాయం కూడా
అందనివ్వబోమని ఆ దేశపు విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి ఇజ్రాయెల్ కజ్ కుండ
బద్దలుకొట్టారు.
‘‘గాజా ప్రాంతానికి మానవతా సహాయమా? ఒక్క
ఎలక్ట్రిక్ స్విచ్ అయినా ఆన్ అవదు. ఒక్క నీటి కుళాయి అయినా తెరుచుకోదు. ఒక్క ఇంధన
ట్రక్కయినా అక్కడికి వెళ్ళదు. ముందు ఇజ్రాయెల్ నుంచి కిడ్నాపైన వారిని వెనక్కు
తిరిగి రానీయండి’’ అని ప్రకటించారు.
ఇజ్రాయెల్ భూభాగం నుంచి హమాస్ ఉగ్రవాదులు
సుమారు 150 మందిని కిడ్నాప్ చేసారు. వారిలో ఇజ్రాయెలీలు, విదేశీయులు,
ద్వంద్వపౌరసత్వం ఉన్నవారూ ఉన్నారు. వారిని గాజా స్ట్రిప్‌కు తీసుకువెళ్ళిపోయారు.
ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాని చుట్టుముట్టింది. ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసింది.
గాజాకు ఎలాంటి నిత్యావసరాలూ చేరకుండా కట్టుదిట్టం చేసింది. నీరు, విద్యుత్ వంటి
కనీస సౌకర్యాలను బంద్ చేసింది.
గత శనివారం పాలస్తీనా దేశాని చెందిన
హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా దాడి ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని
పలు నగరాలు, నివాసప్రాంతాల్లో సుమారు 1200 మంది దుర్మరణం పాలయ్యారు. మొదట తడబడిన ఇజ్రాయెల్,
కొన్ని గంటల్లోనే ఎదురుదాడి మొదలుపెట్టింది. దాదాపు అదే సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు
సహా పలువురిని హతమార్చింది.
హమాస్ ఉగ్రవాదులకు ప్రధాన
స్థావరమైన గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని అధీనం చేసుకోడానికి ఇజ్రాయెల్ దాడులు
చేస్తోంది. ఆ ప్రాంతానికి ఎలాంటి సౌకర్యాలూ అందకుండా నిలువరిస్తోంది.