ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ యేడాది
ఆఖరిలోపు సమావేశమయ్యే అవకాశముంది. రష్యాలో భారత రాయబారి పవన్ కపూర్ ఈ విషయాన్ని
వెల్లడించారు.
రష్యాకు చెందిన నొవోస్తి వార్తా సంస్థతో
మాట్లాడుతూ, ‘‘ఈ విషయం ఇంకా చర్చల దశలో ఉంది. ఉన్నత స్థాయిలో చర్చలు
జరుగుతున్నాయి’’ అని పవన్ కపూర్ చెప్పారు. ఈ సంవత్సరం డిసెంబర్లోగా మోదీ-పుతిన్
సమావేశం జరగవచ్చునని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఐతే ఆ సమావేశం ఎలా, ఎక్కడ,
ఎప్పుడు జరుగుతుందనే వివరాలు ఏవీ వెల్లడించలేదు.
గతవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ
పుతిన్ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నాయకత్వంలో భారత్ రోజురోజుకూ బలం పుంజుకుంటోందన్నారు. ‘‘150 కోట్ల కంటె ఎక్కువ
జనాభా, 7శాతం కంటె ఎక్కువ ఆర్ధిక వృద్ధి కలిగిన భారత్ ఓ గొప్ప శక్తివంతమైన దేశం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ రోజురోజుకూ బలోపేతం అవుతోంది’’ అని
పుతిన్ వ్యాఖ్యానించారు.
మోదీ-పుతిన్ ఆఖరి సమావేశం
2022 సెప్టెంబర్లో ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగింది. షాంఘై కోపరేషన్
ఆర్గనైజేషన్ (SCO) 22వ సమావేశం సందర్భంగా
సమావేశమయ్యారు. ఆ సమయంలో మోదీ పుతిన్ను, తాము ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధాన్ని
ఆపేయవలసిందిగా, కోరారు.