ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ చేపట్టింది. దీనిపై విదేశాంగ
మంత్రి ఎస్.జైశంకర్ ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. స్వదేశానికి రావడానికి ఆసక్తి చూపుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇజ్రాయెల్‌లోని భారతీయులను నేటి నుంచి తరలించనున్నారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు బుధవారంనాడు ప్రధాని మోదీ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించారు. భారతీయులను క్షేమంగా స్వదేశం చేర్చేందుకు వారికి అవసరమైన సహాయం అందించేందుకు ఇజ్రాయెల్‌లో అధికారులు సిద్దంగా ఉన్నారని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.
ఇజ్రాయెల్‌లో 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కొబ్బి శోషాని తెలిపారు. వీరిలో భారత్ తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్న వారిలో కొందరిని గురువారం సాయంత్రం టెల్ అవీవ్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంతో తరలించనున్నారు.
భారతీయులకు సాయం చేసేందుకు ఎంబసీ అధికారులు హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేశారు. +97235226748, +972543278392 నెంబర్లుకు ఎప్పుడైనా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. cons1.telaviv@mea.gov.in ద్వారా కూడా భారత పౌరులు సాయం పొందవచ్చని అధికారులు వెల్లడించారు.