రేపు శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా
జిహాద్ దినంగా జరపాలని హమాస్ ఉగ్రవాద సంస్థ పిలుపునిచ్చింది. ‘అల్ అక్సా ఫ్లడ్’
పేరిట జరిపే కార్యకలాపాల్లో పెద్దయెత్తున పాల్గొనాలని పాలస్తీనా ప్రజలను
ఆదేశించింది. వెస్ట్‌బ్యాంక్, ఇజ్రాయెల్‌లో ఉన్న పాలస్తీనీయులు సైతం పెద్ద సంఖ్యలో
ర్యాలీల్లో పాల్గొనాలని, వీలైనంత వరకూ ఇజ్రాయెలీ సైనికులతో తలపడాలనీ పిలుపునిచ్చింది.
కేవలం పాలస్తీనీయులకే కాకుండా అరబ్బులు,
ముస్లిములు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సానుభూతిపరులు అందరికీ హమాస్
పిలుపునిచ్చింది. ఈ శుక్రవారం నాడు తమకు నిస్సందేహమైన మద్దతును ప్రకటించాలని, అల్
అక్సా మసీదును రక్షించుకోడానికి కలిసి రావాలనీ, ఇజ్రాయెల్ దురాక్రమణను
ప్రపంచానికి వెల్లడించాలనీ హమాస్ పిలుపునిచ్చింది.
ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న పాలస్తీనీయులకు సైతం హమాస్
ప్రత్యేక సందేశం అందించింది. అక్కడి అల్ అక్సా మసీదును రక్షించే విధుల్లో భాగస్వాములు
కావాలని పిలుపునిచ్చింది. ‘‘ఆ మసీదు ఇస్లాం వారసత్వ సంపద. అది దైవ సందేశం. అక్కడ
స్థిరపడిన ఇతరులు దాన్ని ధ్వంసం చేయకుండా కాపాడాలి. దాన్ని ఆక్రమించాలన్న
ఫాసిస్టుల ప్రణాళికలను భగ్నం చేయాలి. ఆ మసీదును విభజించి, దాన్ని యూదుల ప్రార్థనా
మందిరంగా చూపి, అందులో ఒకభాగంలో వారు తమ ఆలయం కట్టుకోడానికి ప్రయత్నాలు
చేస్తున్నారు. వాటన్నిటినీ నిర్వీర్యం చేయాలి. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని
పాలస్తీనీయుల సంతతికి దాన్ని దాఖలు చేయాలి’’ అని హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇంకా… అరబ్బులు, ముస్లిములు, ప్రపంచవ్యాప్తంగా
శరణార్థి శిబిరాల్లో ఉన్న పాలస్తీనియన్లూ అందరూ పాలస్తీనా సరిహద్దుల వద్దకు భారీ సంఖ్యలో
చేరుకోవాలని… పాలస్తీనా, జెరూసలేం, అల్ అక్సాలకు తమ తిరుగులేని సంఘీభావాన్ని ప్రకటించాలనీ
ఆ ప్రకటనలో హమాస్ కోరింది. జెరూసలేంకు దూరంగా ఉన్నవారు ఆ నగరానికి వెళ్ళే మార్గంలో
సమావేశమవ్వాలని సూచించింది.
ఆ ప్రకటనలో హమాస్ ఏం చెప్పిందంటే…
‘‘1. రేపు శుక్రవారాన్ని ‘అల్ అక్సా ఫ్లడ్
ఫ్రైడే’గా ప్రకటించాం. ఆ రోజు అరబ్, ఇస్లామిక్ దేశాల నుంచి, మిగతా స్వేచ్ఛా
ప్రపంచం నుంచీ జనాలు కదిలిరావాలి. ఆ రోజు మన పోరాటానికి మద్దతుగా ర్యాలీలు
చేపట్టాలి, ఆర్థిక సహాయం చేయాలి, మన కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాల్గొనాలి. మన
గడ్డను ఆక్రమించిన వారి నేరాలను వెల్లడించాలి, వారిని ఏకాకులను చేయాలి, అన్నిరకాల
మార్గాల్లోనూ వారిని భంగపరచాలి. పాలస్తీనా, జెరూసలేం, అల్ అక్సా మీద మన ప్రేమను
చాటుకునే రోజది. అది మన త్యాగానికి, సమర్పణ భావానికీ, ధీరత్వానికీ, ముస్లిముల మొదటి
కిబ్లాను రక్షించుకునే గౌరవానికీ, ప్రపంచంలోనే మూడవ పవిత్రమైన మసీదును కాపాడుకునే
ప్రయత్నానికీ నిదర్శనంగా నిలిచే రోజు.
2. వెస్ట్‌బ్యాంక్, ఆ చుట్టుపక్కల
పట్టణాలు, గ్రామాలు, క్యాంపులు, జెరూసలేం చుట్టుపక్కల ప్రాంతాలు, అల్ అక్సా మసీదు
కూడళ్ళ దగ్గర మన యువత ఏకం కావాలి. భారీ ప్రదర్శనలు చేపట్టాలి. జియోనిస్టు
ఆక్రమణదారులు, వారి తొత్తుల కాళ్ళ కింది నేల కదిలిపోవాలి. పిరికిపందలైన ఆ
సైనికులను ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి. జెరూసలేం, అల్ అక్సాలను జియోనిస్టుల ఆక్రమణ
నుంచి విముక్తం చేయాలి.
3. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో ఉన్న
మనవారు, ధైర్యసాహసాలతో, ఆత్మగౌరవంతో ఉన్న పాలస్తీనియన్ అరబ్బులు ఇవాళ పెద్దసంఖ్యలో
బైటకు రావాలి, అల్ అక్సా మసీదును రక్షించుకోడానికి కలిసికట్టుగా నిలబడాలి. ఆ మసీదు
ఇస్లామిక్ వారసత్వం. దాన్ని ధ్వంసం చేయకుండా ఆక్రమణదారులను అడ్డుకోండి. మసీదును
విభజించాలన్న ఫాసిస్టు ఆక్రమణదారుల వ్యూహాలను భగ్నం చేయండి. మసీదును యూదులకు
అనుగుణంగా మార్చేయకుండా, అక్కడ వారి ప్రార్థనామందిరం కట్టుకోకుండా అడ్డుకోండి.
గాజా, వెస్ట్‌బ్యాంక్ లోని మన ప్రజలతో కలిసిపోండి.
4. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా సరే, మన
అరబ్బులు, ఇస్లామిక్ దేశాల ప్రజలు, శరణార్థి శిబిరాల్లోనూ, విదేశాల్లో పలుచోట్లా
ఉన్న పాలస్తీనా ప్రజానీకం, అందరూ కలిసికట్టుగా రావాలి. మన ప్రియమైన పాలస్తీనా
సరిహద్దుల్లోకి రావాలి. భారీ సంఖ్యలో గుమిగూడాలి. ఆరోజు మనం పాలస్తీనా, జెరూసలేం,
అల్ అక్సాకు మన సంఘీభావం ప్రకటించాలి. భౌగోళికంగా దూరంగా ఉండి రాలేకపోయేవారు, తమతమ
ప్రదేశాల్లోనే ఉండి జెరూసలేం వెళ్ళే దారివైపు పెద్దసంఖ్యలో మోహరించాలి.
5. ప్రపంచంలోని మిగతా దేశాల వారందరూ మా
పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిలవాలి. మా చట్టబద్ధమైన పోరాటానికి అండగా ఉండాలి.
స్వేచ్ఛ, స్వతంత్రం, స్వీయ నిర్ణయాత్మకత అనే మా న్యాయబద్ధమైన హక్కులకు
మద్దతివ్వాలి.’’
ఇస్లాం ఆవిర్భవానికి కొన్ని వందల
సంవత్సరాల ముందునుంచీ ఉన్న యూదుల ప్రార్థనా మందిరాన్ని ఆక్రమించి నిర్మించిన మసీదు
ఉన్న స్థలం తమదేనంటూ, ఆ మసీదు ఉన్న ప్రాంతాన్ని మళ్ళీ ఆక్రమించుకోడానికి చేసే
జిహాద్‌లో కలిసి రావాలంటూ హమాస్ ఉగ్రవాద సంస్థ రేపు శుక్రవారం ‘గ్లోబల్ జిహాద్ డే’గా
పాటించాలని పిలుపునిచ్చింది. తమవే మానవ హక్కులని, ఇజ్రాయెల్‌లో ఉన్న యూదులకు
ఎలాంటి హక్కులూ లేవనీ, వారిని తన్ని తరిమేసి, చంపి పారేయడానికి ప్రపంచంలో ఉన్న
అరబ్బులు, ముస్లిములు అందరూ కలిసి రావాలనీ ఒక తేదీని కూడా ప్రకటించడం హమాస్
పైశాచికత్వానికి నిదర్శనం.