టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 7 వేల నుంచి 40 వేల టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫాం 7 దరఖాస్తులు పెట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఓట్ల తొలగింపుపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హామీ ఇచ్చారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలగించిన ఓట్ల వివరాలతో ఎన్నికల ప్రధాన అధికారికి ఓ
మెమొరాండం సమర్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి అన్నీ వివరించారని అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను వెంటబెట్టుకుని అమిత్ షా వద్దకు లోకేశ్ వెళ్లలేదని, అనుకోకుండా వారు కూడా అక్కడ ఉన్నారని అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అరాచక పాలనపై అమిత్ షాకు లోకేశ్ వివరించినట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అక్రమంగా గెలవాలని చూస్తోందని జనం తిప్పికొడతారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన వారిలో అచ్చెన్నాయుడుతోపాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.