ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించేలా కనిపిస్తోంది. ఇజ్రాయల్‌పై దాడికి దిగిన హమాస్‌కు పొరుగు దేశాలు మద్దతు పలకడం యుద్ధం మరింత విస్తరించనుందనేందుకు సంకేతాలిస్తున్నాయి. లెబనాన్, సిరియాల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులకు దిగడం యుద్ధం విస్తరించబోతోందనేందుకు బలం చేకూరుస్తోంది.పాలస్తీనాకు ఇరాన్, ఖతర్, కువైట్ దేశాలు మద్దతు పలకడం, అమెరికా, ఈయూ, భారత్‌లాంటి దేశాలు ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇవ్వడంతో ప్రపంచ దేశాలు రెండుగా చీలే ప్రమాదం కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది.
గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై పై విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్‌కు అనుకోని విపత్తు వచ్చిపడింది.తాజాగా లెబనాన్, సిరియా భూభాగాల నుంచి ఇజ్రాయెల్‌పైకి రాకెట్ దాడులు జరపడం ఆందోళన కలిగిస్తోంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా, సిరియాలో ఆశ్రయం పొందుతోన్న హమాస్ దళాలు ఈ దాడులకు దిగాయని భావిస్తున్నారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
తమకు ఇరాన్ మద్దతుందని హమాస్ ప్రకటించింది. ఖతర్, కువైట్ కూడా పాలస్తీనాకు మద్దతు పలికాయి. హమాస్ దాడుల వెనుక ఇజ్రాయెల్ చిరకాల శత్రువైన ఇరాన్ ఉందనేది బహిరంగ రహస్యం. ఈ యుద్ధంలో లెబనాన్, సిరియాలు కూడా పొల్గొంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముంది. హమాస్‌కు మరిన్ని దేశాలు సాయం అందిస్తే ఈ యుద్ధం ఇక ఇప్పట్లో ముగియకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అరబ్ దేశాల నుంచి హమాస్‌కు మద్దతు లభిస్తోంది. అయితే పశ్చిమాసియాలోని అన్ని దేశాలు హమాస్‌కు మద్దతు పలకడం లేదు. ఐదు దశాబ్దాల కిందట ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో అరబ్ దేశాలన్నీ పాలస్తీనాకు అండగా నిలిచాయి. నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అరబ్‌లీగ్‌లో ఐక్యత లేదని తేలిపోయింది. సౌదీ, యూఏఈలాంటి దేశాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి. ఇలాంటి సమయంలో యుద్ధంలో జోక్యం చేసుకుంటే పెట్టుబడులపై ప్రభావం చూపే ప్రమాదముంది. ఆ దేశాలు అమెరికాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తోన్న అమెరికాతో సంబంధాలు దెబ్బతింటే అది వారి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూసే అవకాశముంది.
అనేక అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీన్నే అబ్రహమిక్ ఒప్పందాలాంటారు. ఈజిప్టు, యూఏఈలు ఒప్పందాలు చేసుకున్నాయి. త్వరలో సౌదీ అరేబియా కూడా ఒప్పందం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సౌదీ ఇజ్రాయెల్ జట్టు కడితే పాలస్తీనా బలహీన పడుతుంది.
వీరి ఒప్పందం జరుగుతుందనే భయంతోనే హమాస్ తాజా దాడులకు పాల్పడిందనే వాదన కూడా ఉంది.
తాజాగా ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ తీవ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. నిన్న రాత్రి జరిపిన దాడుల్లో హమాస్ ముఖ్య కమాండర్ చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఆరు రోజులుగా సాగుతోన్న యుద్ధంలో 3600 మంది చనిపోగా 5 వేల మంది గాయపడ్డారు.