నైపుణ్యాభివృద్ధి
సంస్థ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా
వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన హైకోర్టు, ఈ నెల 17న వాదనలు
వింటామని తెలిపింది.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత
చంద్రబాబు, బెయిల్ కోసం బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో
బెయిల్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేశారు. దీంతో
ఈ పిటిషన్ జస్టిస్ సురేశ్ రెడ్డి ముందుకు వెళ్ళింది.
కేసు పెట్టిన 22 నెలల తర్వాత
ఆకస్మాత్తుగా అరెస్టు చేశారని, సీఐడీ కస్టడీకి కూడా తీసుకుందని చంద్రబాబు తరఫు
న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నెల రోజులుగా జైలులోనే ఉన్నారని, దర్యాప్తు
సహకరిస్తానని బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ
అంశంపై తాము ప్రభుత్వంతో మాట్లాడాలని
సీఐడీ తరఫు న్యాయవాది తెలిపారు. అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ
నెల 17 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన న్యాయమూర్తి, విచారణను కూడా
అదే రోజుకు వాయిదా వేశారు.
సుప్రీంకోర్టులో
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. తన
రిమాండ్ అక్రమమంటూ చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అవినీతి
నిరోధక చట్టం సెక్షన్ 17 ఏకు అనుగుణంగా అధికారులు వ్యవహరించలేదని ఆయన తరఫు
న్యాయవాదులు సుప్రీంలో వాదిస్తున్నారు.