తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్పై
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారణ జరపనుంది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ నమోదు
చేసిన కేసులో చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే
న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. దాంతో చంద్రబాబునాయుడు హైకోర్టును
ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు బుధవారం పిటిషన్ దాఖలు చేసారు. హైకోర్టు
న్యాయమూర్తి కె సురేష్ రెడ్డి ఇవాళ ఈ పిటిషన్పై విచారణ జరుపుతారు.
చంద్రబాబు నాయుడు ఈ కేసును తనపై అక్రమంగా
మోపారని వాదిస్తున్నారు. కేసు నమోదైన 22 నెలల తర్వాత తన పేరును ఉన్నట్టుండి
ఎఫ్ఐఆర్లో నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేసారన్నది ఆయన వాదన. ఏపీ సీఐడీ ఇప్పటికే
తనను రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపిందని బాబు చెప్పారు. మరో
ఐదు రోజుల కస్టడీ కోసం సీఐడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసిందన్నారు. తన
వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా తన బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించిందని బాబు
చెప్పారు.
చంద్రబాబునాయుడు తాను ప్రజాజీవితంలో
ఉన్న వ్యక్తిననీ, చట్టాన్ని గౌరవిస్తాననీ, దర్యాప్తుకు సహకరిస్తాననీ చెప్పారు.
కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని వివరించారు. అందువల్ల తనకు బెయిల్ మంజూరు
చేయాలని హైకోర్టును కోరారు.