టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. ఏపీలో జరుగుతోన్న అరాచకాలను లోకేశ్, అమిత్ షాకు వివరించారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాడని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో కేసులు విచారణ జరుగుతున్నాయని లోకేశ్ కేంద్ర హోం మంత్రికి తెలిపారు. విచారణ పేరుతో తన తండ్రి చంద్రబాబును వేధిస్తున్నారని చెప్పారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బందులు పెడుతున్నట్లు అమిత్ షాకు వివరించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షులు పురందరరేశ్వరితోపాటు లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుపై మొత్తం ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగినట్లు లోకేశ్ మీడియాకు వెల్లడించారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిది కాదని షా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏపీ పరిణామాలు తాను గమనిస్తున్నట్లు అమిత్ షా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.