అమరావతి రింగ్‌రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీఐడీ రెండో రోజు విచారించింది. తనను మొత్తం 47 ప్రశ్నలు అడిగారని అందులో అమరావతి రాజధానికి సంబంధించి కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయన్నారు. తన తల్లి నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ వివరాలు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని నారా లోకేశ్ ప్రశ్నించారు. భువనేశ్వరి ఆదాయపన్ను రిటర్న్స్ అధికారికంగా తెచ్చారా? అడ్డదారుల్లో తెచ్చారా? అనేది తేలుస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు.
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు వ్యవహారం తాను నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖకు సంబంధం లేదని నారా లోకేశ్ గుర్తు చేశారు. సిట్ అధికారులు తిప్పితిప్పి మొదటి రోజు అడిగిన ప్రశ్నలే అడిగారని ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి నోటీసులు ఇస్తారా? లేదా అనే విషయం కూడా స్పష్టంగా చెప్పలేదని లోకేశ్ వెల్లడించారు. అక్రమ కేసులు పెట్టి కక్ష సాధించాలనిచూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లోకేశ్ హెచ్చరించారు.