నైపుణ్యాభివృద్ధి
కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అన్ని ఆధారాలతోనే అరెస్టు చేసిందని
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుదీర్ఘకాలం విచారణ జరిగిన
తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసుకు సూత్రధారి, పాత్రధారి
చంద్రబాబే అన్నారు.
కోర్టు కూడా నమ్మడంతోనే రిమాండ్ విధించిందన్నారు.
సీఎం
జగన్ కక్ష సాధింపు చేశారని చెప్పడం మినహా నేరం జరగలేదని మాత్రం ఎక్కడా చెప్పడం
లేదన్నారు. సీమెన్స్ పేరిట ఫేక్ ఇన్వాయిస్ తో నిధులను పక్కదారి పట్టించారన్నారు.
చంద్రబాబుకు
తెలిసిందల్లా కేసు విచారణకు రాకుండా కప్పేయడమేనని విమర్శించిన సజ్జల, అందుకే నెల
రోజులుగా క్వాష్ మీదే మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుపై నమోదైన ప్రతీ కేసులో
సాంకేతిక కారణాలను సాకుగా చూపి స్టే తెచ్చుకున్నారన్నారు.
రూ. 3,300 కోట్ల ప్రాజెక్టు అని కేబినెట్ ఆమోదం
పొంది, జీవోలలో మొత్తం మార్చేశారన్నారు. తప్పులున్నాయని ఆర్థిక శాఖ చెప్పినా
వినిపించుకోలేదన్నారు.
ఈ ప్రాజెక్టు మొత్తం కుట్రపూరితంగా జరిగిందనేందుకు అనేక
సాక్ష్యాలు ఉన్నాయన్నారు. నిధులు చంద్రబాబుకు
ఎలా చేరాయనే ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే పెండ్యాల శ్రీనివాస్, పార్థసానిలను దేశం
దాటించారన్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకు వచ్చారన్నారు.