భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. పాక్‌లోని సియాల్కోట్లో గుర్తు తెలియని ముష్కరులు జరిపిన కాల్పుల్లో లతీఫ్ అక్కడికక్కడే చనిపోయాడు. 2016లో పఠాన్‌కోట్‌లో ఏడుగురు భద్రతా సిబ్బందిపై దాడి చేసి చంపిన కేసులో లతీఫ్ ప్రధాన సూత్రధారి. పాకిస్థాన్‌లోని ఓ మసీదులో లతీఫ్ హతమయ్యాడని, కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. లతీఫ్‌పై దగ్గర నుంచి కాల్పులు జరిపిన ముష్కరులు మోటార్ సైకిల్‌పై పారిపోయినట్లు పాక్ పోలీసులు తెలిపారు.
పాక్‌లోని సియాల్కోట్ మసీదులో లతీఫ్ మౌల్వీగా పనిచేస్తున్నాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులతో లతీఫ్‌కు సంబంధాలున్నాయని తేలింది. వారికి లతీఫ్ మార్గనిర్ధేశం చేసినట్లు రుజువైంది.
లతీఫ్ ఉగ్రవాద ఆరోపణలపై మొదటిసారి 1994లో అరెస్టయ్యాడు. విచారణ తరవాత జైలు శిక్ష అనుభవించాడు. 2010లో శిక్షను పూర్తి చేసుకుని, పాక్ చేరుకున్నాడు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులోనూ లతీఫ్ నిందితుడుగా ఉన్నాడు. 2010లో భారత్ లతీఫ్‌ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.