అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న లోకేశ్‌ను అధికారులు విచారిస్తున్నారు. తొలిరోజు సిట్ అధికారులు 50 ప్రశ్నలు అడిగినట్టు లోకేశ్ ప్రకటించారు. అయితే అందులో 49 ప్రశ్నలు అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డుకు సంబంధం లేని ప్రశ్నలు వేశారని ఆయన మీడియాకు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకే విచారణ ముగిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు. మంగళవారం విచారణ ముగిసిన తరవాత సీఐడీ మరోసారి నారా లోకేశ్‌కు 41ఎ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ కూడా హాజరయ్యారు. నేటితో లోకేశ్ విచారణ ముగిసే అవకాశముంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేయాలంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.