చైనాకు చెందిన సంస్థల వద్ద నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు అందుకున్నారనే ఆరోపణలపై న్యూస్‌క్లిక్ పోర్టల్‌పై ఇప్పటికే ఈడీ విచారిస్తోంది. తాజాగా సీబీఐ కూడా న్యూస్‌క్లిక్‌పై కేసు నమోదు చేసింది. న్యూస్‌క్లిక్ పోర్టల్ యాజమాన్యం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) ఉల్లంఘించిందని సీబీఐ ఆరోపిస్తోంది. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ ఇవాళ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
చైనా నుంచి న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు నిధులు అందాయనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థను అరెస్ట్ చేశారు. ఇటీవల ఈడీ న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, విలేకరుల ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది.అనేక మందిని విచారించింది. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు పోలీసు కస్టడీ విధించింది.
భారత వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు న్యూస్‌క్లిక్ ద్వారా కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు చైనాతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులను తరలించారనే అనుమానాలపై విచారణ కొనసాగుతోంది. తాము చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ చెపుతున్నారు. ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి రావాల్సి ఉంది.