ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత భారత్ కెనడా దౌత్య సంబంధాలు సున్నితంగా మారిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల తరవాత దౌత్య సంబంధాలు మరింత ఇరకాటంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ కెనడా విదేశాంగ మంత్రులు ఇటీవల అమెరికాలో రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.
రెండు వారాల కిందట వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్తో నెలకొన్న వివాదాన్ని మేము ప్రైవేటుగా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
భారత ప్రభుత్వంతో మేం చర్చలు జరుపుతున్నాం. మా దౌత్యవేత్తల భద్రతకు మేం అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మెలానీ ఇటీవల ప్రకటించారు. వివాదాల పరిష్కారానికి ప్రైవేటు చర్చలు కొనసాగించాలనుకుంటున్నామని మెలానీ వ్యాఖ్యానించారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత భారత్ కెనడా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఢిల్లీలో కెనడా దౌత్యకార్యాలయంలో సిబ్బందిలో 30 మందిని భారత్ వెనక్కు పంపింది.