నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA) నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతోపాటు పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ముంబయి విక్రోలి ప్రాంతంలోని అబ్దుల్ వాహిద్ షేక్ నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. 2006 ముంబయి రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో అబ్దుల్ వాహిద్ నిందితుడుగా ఉన్నాడు. పాతఢిల్లీలోని హౌజ్ క్వాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
కేరళలోని త్రిసూర్, ఎర్నాకుళం, మలప్పురం, వాయనాడ్ జిల్లాల్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత ఆగస్ట్ నెలలో మలప్పురం జిల్లాలో పీఎఫ్ఐ కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేసింది. మలప్పురం జిల్లా వెంగరలోని త్యాగి హమ్జా, తిరూర్లోని కలతిపరంబిల్ యాహుతి, తానూర్‌లో హనాఫా, రంగూర్లో పలదుక్కపలరంబిల్ జాఫర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఆగస్ట్‌లో జరిగిన దాడుల అనంతరం గ్రీన్ వ్యాలీలోని పీఎఫ్ఐకు చెందిన అకాడమీని ఎన్ఐఏ జప్తు చేసింది.