తెలంగాణలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్
ప్రకటించిన మరునాడు, అంటే ఇవాళ, బీజేపీ ప్రచారం ప్రారంభించింది. పార్టీ సీనియర్
నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఆదిలాబాద్‌లో ప్రజా గర్జన సభలో
పాల్గొన్నారు.
తెలంగాణలో పదేళ్ళ కేసీఆర్ పరిపాలనలో
పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ గత పదేళ్ళలో తన
కొడుకును ముఖ్యమంత్రిని చేయడం గురించి మాత్రమే ఆలోచించారనీ, ప్రజల గురించి ఏమాత్రం
పట్టించుకోలేదనీ దుయ్యబట్టారు. కేసీఆర్ కేవలం తన కుటుంబం అభివృద్ధిపైన మాత్రమే దృష్టి
సారించారనీ, కానీ బీజేపీ ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిందన్నారు.
ఆదివాసీ జనాభా అధికంగా ఉండే ఆదిలాబాద్‌లో తన
ప్రసంగంలో అమిత్ షా ఆదివాసీల గురించే ఎక్కువగా మాట్లాడారు. కొమురం భీమ్‌ను
తలచుకుని నివాళులర్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతీయేటా అక్టోబర్ 17న తెలంగాణ
విమోచన దినాన్ని తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. ఆదివాసీ వీరుల స్మారక మ్యూజియాలు
నిర్మిస్తున్నామనీ, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామనీ అమిత్ షా
చెప్పారు. పదేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ కోసం చేసింది ఏమీలేదని విమర్శించారు.
తెలంగాణలో ప్రజలను ఆధునిక రజాకార్లనుంచి రక్షించగలిగేది
బీజేపీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ చేతిలో
ఉందని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తెలంగాణ అభివృద్ధి
వేగవంతమవుతుందన్న అమిత్ షా, రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని
గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. భాజపా ఏర్పాటు చేసే
జనతా సర్కారుతోనే తెలంగాణ ప్రజలకు అవినీతి రహిత పాలన అందుతుందని అమిత్ షా అన్నారు.