ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు బయటపడ్డాయి. ఇవాళ దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. అన్ని దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు ఆగిపోయే అవకాశం కనిపిస్తోండటంతో స్టాక్ మార్కెట్లకు కలసివచ్చింది.
ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 566 పాయింట్ల లాభంతో 66079 వద్ద ముగిసింది. నిప్టీ 177 పాయింట్ల లాభంతో 19689 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి రూపాయి మారకం విలువ 83.24గా ఉంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో కోటక్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్పోసిస్, టాటా స్టీల్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలను పొందాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటన్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.