దసరా శరన్నవరాత్రులను ఉల్లాసమైన, ఉత్సాహమైన
పండుగగా జరుపుకునే సంస్కృతి గుజరాత్ రాష్ట్రానిది. నవరాత్రులు అమ్మవారి పూజలతో
భక్తినీ, గర్బా దాండియా నాట్యాలతో రక్తినీ కలిపి హుషారుగా పండుగ చేసుకోవడం గుజరాత్
సంప్రదాయం. ప్రజలందరూ సమష్టిగా జరుపుకునే ఈ పండుగపై జిహాదీలు కన్నువేసారు. హిందూ
దేవీదేవతలను గౌరవించడానికి మనసొప్పని పరాయి మతస్తులు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం
ఒకచోట చేరే హిందూ యువతులపై వల విసరడానికి మాత్రం ఈ వేడుకలను వాడుకోడానికి కుట్రలు
పన్నుతున్నారు. అందువల్ల గర్బా, దాండియా తదితర సాంస్కృతిక కార్యక్రమాల్లోకి ఇతర
మతస్తులు రాకుండా నియంత్రించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
గుజరాత్‌లోని కర్ణావతి (అహ్మదాబాద్)లో ఇటీవల
విశ్వహిందూ పరిషత్ సమావేశం జరిగింది. అనంతరం పరిషత్ కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి
డాక్టర్ సురేంద్ర జైన్ సమావేశ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
‘‘పెరుగుతున్న జిహాదీ మతోన్మాదం
భారతదేశానికి, భారతీయతకు, భారతీయ సంస్కృతికి ముప్పు. వీటిని
ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా నియంత్రించకపోతే, ఎలా సరిదిద్దుకోవాలో హిందూ సమాజానికి బాగా తెలుసు. హిందువుల మత,
సామాజిక యాత్రలు జరిగే సమయంలో మన హిందూ
అక్కాచెల్లెళ్ళను లక్ష్యం చేసుకుంటున్నారు. హిందూ ఆడపిల్లలు లవ్ జిహాద్ కబంధ
హస్తాల్లో చిక్కుకుంటున్నారు’’ అని డాక్టర్ సురేంద్ర జైన్ ఆవేదన వ్యక్తం చేసారు.
కొద్దిరోజుల క్రితమే జరిగిన కొన్ని
సంఘటనలను సురేంద్ర జైన్ ప్రస్తావించారు. ‘‘ఇటీవల గుజరాత్ నర్మదా జిల్లాలో
బజరంగదళ్ శౌర్య జాగరణ యాత్ర, బరోడాలో గణేష్ నిమజ్జనం, ఖేడాలో శివదేవుడి శోభాయాత్ర, హిమ్మత్ నగర్
మరియు ఖంభాట్‌లో రామనవమి యాత్రలపై మాంసం ముక్కలు విసిరేయడం వంటి సంఘటనలు జరిగాయి. కర్ణావతిలో
గణేష్ పండాల్ వద్ద హిందువుల సంస్కృతీ సంప్రదాయాలను సవాలు చేశారు. లవ్ జిహాద్, మత
మార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, జిహాదీల
మనస్సులలో ఎటువంటి భయమూ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. కొద్దిరోజుల క్రితం సూరత్‌లో
ఒక ముస్లిం యువకుడు తన నేరాలను స్వయంగా ఒప్పుకున్నాడు, లవ్ జిహాద్ కోసం
ఓ మౌల్వీ తనకు లక్షల రూపాయలు ఇచ్చాడని చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా
దర్యాప్తు చేయాలని, అందులో ప్రమేయం ఉన్న మొత్తం మాఫియా ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని
విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ఘటనలను సహించే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం
చేసారు.
కొద్దిరోజుల్లో శరన్నవరాత్రులు మొదలుకానున్నాయి.దుర్గామాత శక్తిని చాటిచెప్పే గొప్ప పండుగలు అవి. నవరాత్రి
వేడుకల్లో గర్బా నృత్యాలు నిర్వహించడం గుజరాత్ సంప్రదాయం. గత కొన్నేళ్లుగా
జిహాదీలు, సంస్కారం లేని వ్యక్తులు ఈ కార్యక్రమాల్లోకి చొరబడి
హిందూ కూతుళ్లను లవ్ జిహాద్లో బంధిస్తున్న సంఘటనలు వందలాదిగా వెలుగులోకి
వస్తున్నాయి. వాటి గురించి స్పందిస్తూ సురేంద్ర జైన్ ‘‘అలాంటి ఘటనలు జరగకుండా నివారించడానికి, హిందూ పర్వదినాల వేడుకల్లోకి ఇతర మతాల వారి
ప్రవేశాన్ని పూర్తిగా నిరోధించడం అవసరం. ఈ మతోన్మాదులు, స్త్రీద్వేషుల నుండి మన సంస్కృతీ
సంప్రదాయాలను, మన అక్కచెల్లెళ్ళను రక్షించుకోడానికి ఒక ప్రతిపాదన చేస్తున్నాం. గర్బా
కార్యక్రమాల నిర్వాహకులు, వాటిలో పాల్గొనే ప్రతీ వ్యక్తి ఆధార్ కార్డును చూసాక మాత్రమే
ప్రవేశాన్ని అనుమతించమని అభ్యర్థిస్తున్నాం. దానివల్ల అవాంఛనీయ శక్తులు గర్బా
నృత్యాల వేడుకలలోకి చొరబడకుండా చేయడం, అనుకోని ఘటనలు జరిగినప్పుడు బాధ్యులను
గుర్తించడం సులువవుతుంది. పోలీసులు, ప్రభుత్వంతో పాటు కార్యక్రమాల నిర్వాహకులు,
భద్రతా సిబ్బంది కూడా దీనికి అవసరమైన అన్ని ఇతర చర్యలను తీసుకోవలసి ఉంటుంది’’ అని సూచించారు.