ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోన్న వేళ ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్‌కు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. హమాస్ ఉగ్ర దాడులను మోదీ ఖండించారు. అక్కడి తాజా పరిస్థితులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదీకి వివరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు భారత్ అన్ని విధాలా అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ ఖండిస్తుందని ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు.
హమాస్ ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ గాజాపై తీవ్రదాడులకు దిగింది. ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడ్డ హమాస్ మిలిటెంట్లను ఏరివేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇప్పటిదాకా 1500 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దేశంపై దాడికి దిగి హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము ముగింపు పలుకుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.