హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది.
చివరి ఉగ్రవాది వరకు ఏరివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించిన నేపథ్యంలో పలు దేశాలు అండగా నిలుస్తామని ప్రకటించాయి. హమాస్‌కు సౌదీ అరేబియా మద్దతు తెలపడం ఆందోళన కలిగిస్తోంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సౌదీ యువరాజు ఫోన్లో మాట్లాడినట్లు ఆ దేశ జాతీయ మీడియా ప్రకటించింది.
ఇజ్రాయెల్ హమాస్ తీవ్ర వాదుల మధ్య యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా పాలస్తీనాకు మద్దతు పలికింది. గౌరవప్రదమైన జీవితం కోసం, చట్టబద్దమైన హక్కుల కోసం, వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి జరుపుతోన్న పోరాటంలో పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడతామని సౌదీ యువరాజు పాలస్తీనా అధ్యక్షుడికి చెప్పినట్లు సౌదీ మీడియా తెలిపింది. పాలస్తీనా అంశం సౌదీ అరేబియాకు చాలా కీలకమని గత నెలలోనే యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు.
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించింది. తమకు ఇరాన్ మద్దతు ఉందని హమాస్ ఉగ్రవాదులు ప్రకటించిన సంగతి తెలిసిందే. హమాస్‌కు ఇరాన్ మద్దతు ఉందనేందుకు తమ వద్ద కచ్ఛితమైన ఆధారాలు లేవని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని హమాస్ మద్దతుదారులకు బలమైన సందేశం పంపుతోన్నట్లు అమెరికా ఎయిర్‌ఫోర్స్ జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్ వెల్లడించారు.ఇజ్రాయెల్‌కు అవసరమైన ఆయుధాలు పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్‌కు అమెరికా చేస్తోన్న ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఇజ్రాయెల్‌పై దాడికి అమెరికా అధ్యక్షుడే కారణమంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలాంటి దాడులు జరిగేవి కాదన్నారు. అమెరికాకు వలస వచ్చే వారిలో అధిక శాతం మంది ఎక్కడ నుంచి వస్తున్నారో కూడా తెలియడం లేదని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. హమాస్ దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఖండించారు. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అమెరికా అండగా నిలుస్తుందని చెప్పారు.