గాజాలోని హమాస్ మిలిటెంట్ల శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులకు దిగింది. మంగళవారం నాటికి గాజా స్ట్రిప్ ప్రాంతంలో 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమైనట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా సరిహద్దుపై ఇజ్రాయెల్ దళాలు పట్టు సాధించాయని ఆ దేశ సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ విలేకరులకు తెలిపారు.
సోమవారం రాత్రి నుంచి గాజా సరిహద్దు దాటి ఎవరూ ఇజ్రాయెల్‌లోకి రాలేదని రిచర్డ్ వెల్లడించారు. అయినా అక్కడక్కడా చొరబాట్లు జరుగుతూనే ఉంటాయన్నారు. గాజా సరిహద్దు చుట్టూ ప్రజలను సైన్యం దాదాపుగా ఖాళీ చేయించింది. శనివారం నాడు హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులతో విరుచుకుపడటంతో ఇప్పటి వరకు 900 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో పౌరులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. ఈ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు.