పాలస్తీనియన్ హమాస్ మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్
మీద దాడితో మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధ వాతావరణం యావత్ ప్రపంచాన్నీ
వేడెక్కిస్తోంది. సోమవారం సాయంత్రం లండన్‌లో ఇరువర్గాల ఆందోళనకారుల మధ్య ఘర్షణ
చోటు చేసుకుంది.
లండన్‌లోని హై స్ట్రీట్ కెన్సింగ్‌టన్ ట్యూబ్
స్టేషన్ దగ్గర పాలస్తీనా అనుకూల ఆందోళనకారులు, ఇజ్రాయెల్ అనుకూల ఆందోళనకారులు
ఘర్షణకు దిగారు. ఇరువర్గాలనూ శాంతింపజేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
ఇరువర్గాలూ వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టాయి. ఆ ప్రదర్శనలు ఉద్రిక్తతలకు
దారితీసాయి. పాలస్తీనా అనుకూలవాదులు, ఇజ్రాయెల్ అనుకూలవాదుల మధ్య హింసాకాండ
చెలరేగకుండా చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వెలుపల
పాలస్తీనా అనుకూలవాదులు ప్రదర్శన చేయడానికి తలపెట్టారు. వారిని నిలువరించడానికి
డజన్ల కొద్దీ పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
ఇంగ్లండ్ ప్రధానమంత్రి ఋషి శునక్, ఇజ్రాయెల్ మీద
దారుణమైన దాడి చేసిన హమాస్‌కు మద్దతు ప్రకటించిన వారందరూ ఉగ్రవాదులేనంటూ తీవ్రంగా
స్పందించారు. ‘‘హమాస్‌కు మద్దతిచ్చేవాళ్ళందరూ ఈ బాధాకరమైన దాడికి పూర్తిగా బాధ్యులే.
వాళ్ళు తీవ్రవాదులు కారు, స్వాతంత్ర్యపోరాట యోధులు కాదు, వాళ్ళు ఉగ్రవాదులు’’ అంటూ
శునక్ ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.
సోమవారం సాయంత్రం ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ముందు
వేలాదిమంది పాలస్తీనా అనుకూల ఆందోళనకారులు గుమిగూడారు. కొంతమంది దీపస్తంభాలు
ఎక్కేసారు. తమ జెండాలతో పాటు కాగడాలూ ప్రదర్శించారు. ‘ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం’,
‘అల్లాహో అక్బర్’ వంటి నినాదాలతో హోరెత్తించారు. పనిలో పనిగా, ‘పాలస్తీనాకు
విముక్తి కావాలి’ అని రాసిన వస్తువులను విక్రయించారు. దౌత్యకార్యాలయ భవనం వైపు
బాణాసంచా కాల్చారు.
లండన్ మెట్రోపోలీసులు ఒక ప్రకటనలో ‘‘ఈ సాయంత్రం
సెంట్రల్ లండన్‌లో కూడా కార్యక్రమాలు జరిగాయి. ముగ్గురిని అరెస్ట్ చేసాం. లైవ్
అరెస్ట్ ఇంక్వైరీలు జరుగుతున్నాయి’’ అని వెల్లడించారు.
పాలస్తీనా నిరసనలకు విరుద్ధంగా ఇజ్రాయెలీలు కూడా
డౌనింగ్ స్ట్రీట్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. హమాస్ దాడిలో చనిపోయినవారు, హమాస్
ఉగ్రవాదులు నిర్బంధించి తీసుకుపోయిన వారికోసం ఏడుస్తూ ప్రార్థనలు చేసారు. ఇంగ్లండ్
ప్రధానమంత్రి ఋషి శునక్ ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తూ, లండన్‌లోని యూదుల
ప్రార్థనా ప్రదేశం సినగాగ్‌ను సందర్శించారు.
మరోవైపు, బ్రిటన్ వీధుల్లో ఉగ్రవాదచర్యలను
ఎంతమాత్రం సహించేది లేదని ఇంగ్లండ్ ఎంపీ సుయెల్లా బ్రేవర్‌మ్యాన్ ప్రకటించారు. ‘‘సెమెటిజానికి
వ్యతిరేకంగా, లేదా, ఉగ్రవాదాన్ని గొప్పగా చూపించే ప్రదర్శనలను సహించే ప్రసక్తే
లేదు. హమాస్, మరే ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలికే ప్రదర్శనలు, బ్రిటన్‌లోని యూదులను
భయభ్రాంతులకు గురిచేసే ప్రదర్శనలపై పోలీసు చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటారు’’
అని ఆమె ప్రకటించారు.
సోమవారం ఉదయం లండన్‌లోని గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో
ఉన్న ఒక కోషెర్ (యూదు) రెస్టారెంట్‌ని దుండగులు ధ్వంసం చేసారు. అక్కడికి దగ్గరలో
ఉన్న బ్రిడ్జి మీద ఆగంతకులు ‘పాలస్తీనాను విడిచిపెట్టండి’ అని రాసారు. అదే సమయంలో,
ఇంగ్లండ్‌లోని యూదు కుటుంబాలేవీ హమాస్ దాడుల వల్ల ప్రభావితం కాలేదని, స్వదేశంపై
జరుగుతున్న దాడులకు ఆందోళన, బాధ మాత్రం ఉన్నాయనీ ఇంగ్లండ్‌లోని యూదు మత ప్రధాన బోధకుడు
వివరించారు.
లండన్ నగర మేయర్ సాదిక్ ఖాన్ ‘‘మన నగరంలో ద్వేష
ప్రదర్శనలను సహించే ప్రసక్తే లేదు. నేను పోలీసులతో మాట్లాడుతూనే ఉన్నాను. లండన్‌లోని
యూదులకు మద్దతుగా ఇవాళే కాదు, ఎప్పటికీ నిలుస్తాను. ఇలాంటి చర్యలకు పాల్పడిన
వారిపట్ల చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం’’ అని సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఈ వారంలో ఇరు వర్గాలూ
మరిన్ని ఆందోళనలకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి, ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లోని బీబీసీ
భవనం వద్ద పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహిస్తారు.