అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఇవాళ ఉదయం పది గంటలకు లోకేశ్ చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ అధికారులు గతంలోనే లోకేశ్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా కొంత వెసులుబాటు కల్పించింది. సీఐడీ విచారణకు అంగీకరిస్తూనే అరెస్టు చేస్తే కోర్టుకు తెలపాలని తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నారా లోకేశ్ ఇవాళ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. లోకేశ్‌తో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని హైకోర్టు గత వారం ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలని కూడా నిబంధన విధించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారంటూ సీఐడీ అభియోగాలు మోపింది. దీనిపై సిట్ ఇవాళ విచారణ చేపట్టింది.