ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధం తీవ్రరూపు దాల్చుతోంది. హమాస్ దాడుల్లో ఇప్పటికే 700 మంది మరణించారు. మరో 2300 మంది గాయపడ్డారు. వందలాది మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. హమాస్ మెరుపుదాడులపై ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర హెచ్చరికలు చేశారు. యుద్ధాన్ని వారు మొదలు పెట్టినప్పటికీ, మేము ముగింపు పలుకుతామని ఆయన హెచ్చరించారు.
హమాస్ ఉగ్రవాదులను హతం చేసేందుకు ఇజ్రాయెల్ 3 లక్షల మంది సైన్యాన్ని రంగంలోకి దింపింది. 1973 ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం తరవాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘‘మేము ఈ యుద్దాన్ని కోరుకోలేదు, క్రూరమైన రీతిలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారని’’ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. శనివారం మొదలైన హమాస్ దాడుల తరవాత ఇప్పటి వరకు 700 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. 2300 మంది గాయపడ్డారు. వందలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. హమాస్ ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని, దశాబ్దాలపాటు శత్రువులు గుర్తుంచుకునే విధంగా సమాధానం చెబుతామని నెతన్యాహు ఘాటు హెచ్చరికలు చేశారు. అమాయక ప్రజలపై హమాస్ మిలిటెంట్ల క్రూరమైన దాడులు మనసుకు కలచివేశాయని, ఇళ్లలోకి దూరి ప్రజలను చంపడం, మ్యూజిక్ ఫెస్టివల్‌పై
విచక్షణా రహితంగా కాల్పులు జరపడాన్ని నెతన్యాహు నరమేధంగా అభివర్ణించారు. హమాస్‌ను ఐసిస్‌గా గుర్తించి నాగరిక సమాజం ఏకమై వారిని ఓడించాలని నెతన్యాహు పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన దేశాలను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు, వారి సహకారం మరవలేనిదని ఆయన అన్నారు. అమెరికాకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
ఇజ్రాయెల్ తమ పౌరుల కోసం పోరాడుతోందని, అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం కోసం తాము పోరాడుతున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ గెలుపు నాగరిక సమాజం గెలుపుగా ఆయన అభివర్ణించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతోందని ఆయన అన్నారు. గాజా ప్రజలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే బందీలను చంపివేసి, ఆ వీడియోలు ప్రసారం చేస్తామని హమాస్ హెచ్చరించినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.