ఇజ్రాయెల్‌పై ఏకపక్షంగా దాడికి దిగి, మధ్యప్రాచ్యంలో
తాజా యుద్ధానికి దారితీసిన పాలస్తీనాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ
మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇవాళ తీర్మానం చేసింది.
పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ హమాస్,
ఇజ్రాయెల్ ప్రజలపై చేసిన దారుణమైన దాడిని ఖండించిన ఒక్కరోజులోనే, కాంగ్రెస్ పార్టీ
తన వైఖరి స్పష్టం చేసింది.
ఇవాళ, అంటే సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్
వర్కింగ్ కమిటీ సమావేశంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితి గురించి చర్చించింది.
ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు తక్షణమే కాల్పుల విరమణ చేయాలంటూ
పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పాలస్తీనాపై తన ప్రేమను బహిర్గతం
చేసింది. ‘పాలస్తీనా ప్రజలకు తమ భూమిని పొందడానికి, తమను తామే పరిపాలించుకోడానికీ,
ఆత్మగౌరవంతో హుందాగా జీవించడానికి ఉన్న హక్కులకు కాంగ్రెస్ ఎప్పటినుంచో
మద్దతిస్తోంది’ అని సీడబ్ల్యూసీ ప్రకటన వెల్లడించింది.
‘తక్షణమే కాల్పుల విరమణ జరగాలి, సుదీర్ఘకాలంగా
అపరిష్కృతంగా ఉన్న, ప్రస్తుత వివాదానికి దారితీసిన అన్ని అంశాలపైనా చర్చలు
మొదలుపెట్టాలి’ అని సీడబ్ల్యూసీ ప్రకటన పేర్కొంది.
విచిత్రమేంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ నిన్న ఆదివారం చేసిన
ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రజలపై దారుణమైన దాడులను తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్
హెడ్ జైరాం రమేష్ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ ‘‘ఇజ్రాయెల్
ప్రజలపై జరిగిన అమానుషమైన దాడిని భారత జాతీయ కాంగ్రెస్ ఖండిస్తోంది. ఆత్మగౌరవంతో,
సమానత్వంతో గౌరవప్రదంగా జీవించాలన్న పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన కోరికలు
తీరడానికి చర్చలు, సంప్రదింపులు మాత్రమే సరైన మార్గం. అదే సమయంలో ఇజ్రాయెలీ ప్రజల న్యాయబద్ధమైన
జాతీయ భద్రత కూడా తప్పనిసరిగా ఉండాలి. హింస ఎలాంటిదైనా ఏ సమస్యనూ పరిష్కరించదు.
అందుకే హింసాకాండ నిలిచిపోవాలి’’ అని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్నా లేకపోయినా,
మొదటినుంచీ పాలస్తీనా పక్షమే ఉంది. ఇజ్రాయెల్‌తో పాలస్తీనా సంబంధాలు మెరుగుపడాలనీ,
పాలస్తీనియన్ల ఆకాంక్షలు నెరవేరాలనీ కాంగ్రెస్ చెప్పేది. బీజేపీ ప్రభుత్వం
ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడాన్ని కాంగ్రెస్ ఇటీవలే విమర్శించింది. పాలస్తీనాకు
భారత్ ఎప్పుడూ అండగా నిలిచిందనీ, ఆ పద్ధతిని బీజేపీ మార్చేస్తోందనీ ఆరోపించింది.
తాజాగా
శనివారం మొదలైన యుద్ధానికి పాలస్తీనా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడమే కారణం
కావడంతో, కాంగ్రెస్ తొలుత తటస్థంగా ఉన్నట్లు నటించింది. నిన్న ఆదివారం ప్రకటనలో పాలస్తీనా
దాడిని తప్పుపట్టింది. అయితే ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ ముసుగు తీసేసింది.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ చేసిన దాడులను బీజేపీ నేతృత్వంలోని భారత
ప్రభుత్వం ఉగ్రవాద చర్యగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ తమ వైఖరిని
బైటపెట్టుకుంది.