కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత
వ్యతిరేక వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని మరోసారి స్పష్టమైంది. భారత్‌ను పదేపదే రెచ్చగొట్టేలా
ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడతో చర్చల్లో సైతం
భారత్ గురించి ప్రస్తావించారు. ఆ విషయాన్ని స్వయంగా ట్రూడోనే వెల్లడించారు.
ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక
భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ మన దేశంతో కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధాని జస్టిన్
ట్రూడో మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ‘చట్టాలను సమర్థించడం, గౌరవించడం’పై ఆయన
సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది. అంతేకాదు,
యూఎఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తోనూ భారత్-కెనడా దౌత్య వివాదం గురించి
చర్చించారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
‘‘యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్లో మాట్లాడాను.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మేమిద్దరం ఆందోళన చెందాం. పౌరుల
ప్రాణాలను రక్షించాల్సిన అవసరం గురించి చర్చించాం. ఇక భారత్ అంశం, చట్టాలను
సమర్థించడం, పరస్పరం గౌరవించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను గురించి కూడా మేం
చర్చించుకున్నాం’’ అని ట్రూడో ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.
భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్
హత్యపై ట్రూడో వ్యాఖ్యలతో భారత్-కెనడా మధ్య దౌత్యసమరం మొదలైంది. అలాంటి తరుణంలో
ట్రూడో ట్వీట్ ఇరు దేశాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా ఉంది. నిజ్జర్‌ను తమ దేశ
పౌరుడని పేర్కొన్న ట్రూడో.. కెనడా భూభాగంలో జరిగిన ఈ హత్యలో విదేశీ ప్రభుత్వాల
ప్రమేయం తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చట్టాల
గురించి భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలతో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు
పాల్పడుతున్నారు.
ట్రూడో కొన్నాళ్ళ క్రితమే యూకే ప్రధాని ఋషి
శునక్‌తోనూ ట్రూడో ఈ వివాదం గురించి చర్చించారు. ‘భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల పరిస్థితులను
ఋషి శునక్‌కు జస్టిన్ ట్రూడో వివరించారు. దౌత్య సంబంధాల విషయంలో వియన్నా
కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వభౌమాధికారం, చట్టపాలనను అన్ని దేశాలు గౌరవించాలనే వైఖరికి
బ్రిటన్ కట్టుబడి ఉన్నట్లు శునక్ స్పష్టం చేసారు. రెండు దేశాల మధ్యా పరిస్థితులు
మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు’ అని బ్రిటిష్ ప్రధాని కార్యాలయం గతవారం వెల్లడించింది.