బ్లాక్ మనీకి అడ్డాగా ఉన్న స్విస్ బ్యాంక్, ఖాతాదారుల వివరాలతో ఐదో జాబితాను భారత్కు అందించింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా స్విస్ బ్యాంక్ ఈ జాబితాను అందించింది. ఈ జాబితాలో వ్యాపారులు, ట్రస్టులకు చెందిన వేలాది ఖాతాదారుల వివరాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదో జాబితాలో 104 దేశాలకు చెందిన 36 లక్షల ఖాతాల వివరాలను స్విస్ బ్యాంక్ విడుదల చేసింది.
తాజా జాబితాలో ఖాతాదారుల వివరాలు, ఖాతాదారుడి పేరు, చిరునామా, ఖాతా సంఖ్య, ఎంత మొత్తం నగదు నిల్వ ఉంచారు, నివాసం, ట్యాక్స్ నెంబరు వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్విస్ బ్యాంక్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఉగ్రవాద కార్యకలాపాలు, మనీలాండరింగ్, పన్ను ఎగవేతలు, ఇతర నేరాలను వెలికితీసే అవకాశం ఉంది. స్విస్ బ్యాంక్ సమర్పించిన వివరాలను ఐటీ శాఖ అధికారులు తనిఖీ చేయనున్నారు.