తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడును
కక్షసాధింపుతో అరెస్టు చేయలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం
చేశారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్షా లేదని, ఆయన అరెస్టు సమయంలో తాను దేశంలో
లేనని, తాను లండన్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని సీఎం వివరించారు. చంద్రబాబు
జైల్లో ఉన్నా, ఊళ్ళో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టు కక్షసాధింపుతో జరగడమే నిజమనుకుంటే
కేంద్రంలో బీజేపీ ఉందని, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాడని, రాష్ట్ర బీజేపీ
అధ్యక్షురాలు సహా ఆ పార్టీలో సగంమంది టీడీపీ మనుషులే ఉన్నారని జగన్ గుర్తు చేసారు.
అయినా కేంద్రంలోని ఆదాయపు పన్ను శాఖ,
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు చంద్రబాబుపై విచారణ
జరిపి అవినీతిని నిరూపించాయని, దోషుల అరెస్టు కూడా జరిగిందని సీఎం అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను రాష్ట్రంలో
అడుగు పెట్టనివ్వబోనంటూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అనుమతులు కూడా ఇవ్వలేదని
గుర్తు చేశారు.
“ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన చంద్రబాబుపై విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా
అరెస్టు చేయకూడదట, కోర్టులు ఆధారాలతో రిమాండుకు పంపినా కూడా చంద్రబాబును కానీ, గజదొంగల ముఠా
వీరప్పన్ను చట్టాలకు పట్టి ఇవ్వడానికి వీలు లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా
వాదనలు వినిపిస్తున్నాయి. ఆలోచన చేయండి” అన్నారు సీఎం జగన్.
చంద్రబాబు ఒక సున్నా, పవన్ కళ్యాణ్ ఇంకొక
సున్నా, ఆ రెండు సున్నాలు కలిసినా లేక నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నాయేనని ఎద్దేవా
చేశారు. దత్తపుత్రుడి జీవితమంతా చంద్రబాబును భుజానికి ఎత్తుకోవడమేనని, చంద్రబాబు
దోచుకున్నది పంచుకోవడంలో ఆయన భాగస్వామి అనీ సీఎం విమర్శించారు. ఇద్దరూ కలిసి
ప్రజలను ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తారని, నిజంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచించరని అన్నారు.
వీరికి తెలిసిన రాజకీయమంతా కూడా అధికారంలోకి రావడం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే అని మండిపడ్డారు.
విజయవాడలో జరిగిన పార్టీ
విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నీ పొత్తుల
కోసం వెంపర్లాడుతున్నాయని, ఎంతమంది కలిసినా, ప్రజలతో
పొత్తులో ఉన్న తమను ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు.