స్కిల్
డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు
చేసిన క్వాష్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్,
జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే
వాదించగా, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు.
17
ఏ లోని నిబంధనలు బెంచ్ ముందు హరీశ్ సాల్వే వివరించారు. ఈ కేసులో 17ఏ
వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొన్నారు.
సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రోహత్గీ కోరగా, ధర్మాసనం
అనుమతి ఇచ్చింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
చంద్రబాబు
క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3నే ఇరపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ముందు
దాఖలు చేసిన పత్రాలు తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను
నేటికి వాయిదా వేసింది. దీంతో ఈ రోజు వాదనలు కొనసాగాయి. 2018లోనే విచారణ
ప్రారంభమైందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున
ముకుల్ రోహత్గీ చేసిన వాదనను జస్టిస్ బేలా ఎం. త్రివేది ప్రస్తావించారు. అనంతరం
హరీశ్ సాల్వే స్పందిస్తూ ఆ వాదన సహేతుకం కాదన్నారు.
స్కిల్
డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్
పిటిషన్ తో పాటు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు
దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 5న ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, అనంతరం ఆరో తేదీకి
విచారణ వాయిదా పడింది.
ఆరో తేదీ విచారణలో కూడా ఏజీ వాదనలు వినిపించారు. కేసు కీలక
దశలో ఉన్నందున చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్
ఇవ్వొద్దని కోరారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి
ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న
న్యాయమూర్తి తీర్పు ను రిజర్వు చేశారు. సోమవారం వెల్లడిస్తామని చెప్పారు. నేడు
న్యాయమూర్తి బెంచ్ పైకి వచ్చిన వెంటనే రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు
ప్రకటించారు.