హమాస్ తీవ్రవాదులను అణచివేసేందుకు ఇజ్రాయెల్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులతో వందలాది మంది పౌరులను కోల్పోయిన ఇజ్రాయెల్, గాజా ప్రాంతంలో దాగిన ఉగ్రవాదులను బయటకు లాగేందుకు కరెంటు, నీరు, ఆహారం సరఫరాను నిలిపేసింది. ‘‘ గాజాస్ట్రిప్ ప్రాంతాన్ని దిగ్భంధించమని ఆదేశాలు జారీ చేశాను. అక్కడ మేం మానవ మృగాలతో పోరాడుతున్నామని’’ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవో గల్లాంట్ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ పట్టణాలపై పూర్తి పట్టుసాధించినట్టు ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి వెల్లడించారు. ఉగ్రవాదులు ప్రజల మధ్యలో నక్కే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా మిలిటెంట్లకు, సైన్యానికి యుద్ధం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రస్తుతం ఎక్కడా దాడులు లేవని హగారి చెప్పారు. గాజా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులతో పహారా కాస్తున్నట్లు ప్రకటించారు. ఐడీఎఫ్ బలగాలకుతోడు మరో 3 లక్షల దళాలను కూడా మోహరించినట్టు హగారి వెల్లడించారు.