ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఒక దఫా ప్రచారం కూడా ముగించారు.
ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేయాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న బీజేపీ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.
2018 ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్
2018లో బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి సత్ఫలితాలు సాధించింది. 2018లో బీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 21, ఎంఐఎం 7, టీడీపీ 1, బీజేపీ 1, ఇతరులు 1 సీటు గెలుచుకున్నారు. తరవాత తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, బీఆర్ఎస్లో నెంబర్ టూగా ఎదిగిన ఈటల రాజేంద్రర్ మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఉద్యమ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడటం బీఆర్ఎస్కు తీరని నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదు.
ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్లో కంగారు
తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అధికార బీఆర్ఎస్కు చేదు అనుభవాలను మిగిల్చాయి. బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో 2021 నవంబరులో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సర్వశక్తులు వడ్డినా ఫలితం దక్కలేదు. దళితబంధు పధకం పేరుతో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఒక్క నియోజకవర్గంలోనే రూ.270 కోట్లు ఖర్చు చేసినా కేసీఆర్‌కు పరాభవం తప్పలేదు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేయాలని విశ్వప్రయత్నం చేసిన కేసీఆర్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపు బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. సహజంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులు గెలుస్తూ ఉంటారు. కానీ తెలంగాణలోని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత వందల కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం జరిగింది. అంతజేసినా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి కొద్ది మెజారిటీతో గెలవడం చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా చెప్పుకోవచ్చు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా?
గత పదేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బంగరు తెలంగాణ సాధించామని చెబుతున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారు. లబ్దిదారులు లక్షల్లో ఉండగా, వేలల్లో ఇళ్లు నిర్మించి లాటరీలు వేసి ఇళ్లు కేటాయించారు. వంద మంది లబ్దిదారుల్లో ఒకరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి, 99 మందికి మొండి చేయి చూపడం ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో నిరుద్యోగులకు మొదటి ఏడు సంవత్సరాలు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా అన్ని నోటిఫికేషన్లను 2022లో విడుదల చేశారు. అందులో చాలా పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో అవి రద్దయ్యాయి. దీంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యువత ఉద్యోగాలు లేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉంది. ఈ అంశం బీఆర్ఎస్కు గొడ్డలి పెట్టులా మారనుంది. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం రైతాంగంలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. 2018లో అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు లక్ష రుణమాఫీ హామీ నేటికీ నెరవేర్చలేదు. ఈ అంశాలు బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. పదేళ్ల నుంచి అధికారంలో ఉండటం బీఆర్ఎస్ బలం, బలహీనత కూడా అదేనని చెప్పవచ్చు.
ఎవరికి వారే కాంగ్రెస్ తీరే
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వృద్ధనేతలకు పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా లేదు. అలాగని యువనేతల మార్గంలోనూ నడవడం లేదు. ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి అనూహ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. దీన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఒక వేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని చాలా మంది ఆ పార్టీ సీనియర్ నేతలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే రేవంత్‌రెడ్డితో కలసి పనిచేసేందుకు చాలామంది నేతలు ముందుకు రావడం లేదు. తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేమేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోన్నా.. ప్రజల్లో అంతగా స్పందన లేదనే చెప్పాలి. అయతే కర్ణాటకలో గెలిచిన ఊపుమీదున్న కాంగ్రెస్ అక్కడి మేనిఫెస్టోని తెలంగాణలోనూ ప్రకటించారు. హామీలు ఘనంగా ఉన్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, జనం నమ్మేలా చేయడంలోనే కాంగ్రెస్ విజయం ఆధారపడి ఉంది.
బీజేపీ దూకుడుకు కళ్లెం వేసిన కేంద్ర నాయకత్వం
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీని ఆ పార్టీ పెద్దలు పెద్ద దెబ్బే కొట్టారు. తెలంగాణ బీజేపీనీ దూకుడుగా ముందుకు నడిపించిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన మేరకు ఇలా జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందని ఆధారాలున్నాయని, మరో వారంలో అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ ప్రకటించిన నెల రోజుల్లోనే ఆయనకు పదవీ గండం ఏర్పడింది. దూకుడు మీదున్న బీజేపీకి పగ్గాలు వేశారు. ఇక టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీ అంటూ మహారాష్ట్ర మీదకు దండెత్తిన కేసీఆర్ కూడా చల్లబడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ల అవగాహన ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ సైలెంట్ అయ్యారనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇది బీజేపీకీ తీవ్ర నష్టం కలుగజేసింది. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముందుగా అంచనా వేశారు. చివరకు బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించడం, ఆ పార్టీ చారిత్రాత్మక తప్పిదంగా చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం, ఆ పార్టీకి తెలంగాణలో మరణశాసనం రాసిందడంలో సందేహం లేదు.
ఎంఐఎం పాతబస్తీకే పరిమితం
ఎంఐఎం పాతబస్తీ పార్టీ. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మాత్రమే ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల మాదిరే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఆరేడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, వామపక్షాలు ఖాతా తెరవకపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కామెడీ పార్టీగా మిగిలిపోనుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యే అసలైన పోటీ జరగనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.