విపక్షాల
పొత్తులు, ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం, వైసీపీ అధినేత జగన్, తన మార్క్
వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ
పాలనలో జరిగిన మంచిని వివరించడంతో పాటు పార్టీ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను
వెల్లడించారు.
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైసీపీ
విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్, వైసీపీ ప్రచార పర్వంపై శ్రేణులకు
దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం
ద్వారా మేలు పొందిన సమూహాల ద్వారా ఓట్లను పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి
సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. వరుస ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం
అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు.
ప్రజలకు
పాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో నవంబర్ 1 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’
కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం 40
రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా
గ్రామ, మండల స్థాయి నేతలు సచివాలయాలను సందర్శించడంతో పాటు ప్రభుత్వం చేసిన మేళ్ళను
ప్రజలకు వివరించాలని సూచించారు. గత ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని
ప్రతీ ఇంటికి వెళ్ళి వివరించడంతో పాటు, టీడీపీ-జనసేన మోసాలను తెలియజేయాలన్నారు.
అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు వైసీపీ నేతల
‘బస్సు యాత్ర’ ఉంటుందన్న వైఎస్ జగన్… ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. యాత్ర చేసే బృందంలో
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఉంటారని, ప్రతీరోజు మూడు మీటింగులు ఉండేలా షెడ్యూల్ ఉంటుందని వివరించారు. వైసీపీ
పాలనలో అందుతున్న సామాజిక న్యాయం, సాధికారత గురించి ఈ కార్యక్రమంలో ప్రజలకు
చెప్పాలన్నారు.
డిసెంబర్
11 నుంచి జనవరి 15 వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరం జరపాలని నిర్ణయించినట్లు
ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తామన్నారు.
దేశ స్థాయిలో వై నాట్ ఏపీ అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం
నిర్వహించే క్రీడా సంబరం ఈ కార్యక్రమం అని జగన్ చెప్పారు.
ఫిబ్రవరిలో మేనిఫెస్టో
విడుదల చేసి మార్చిలో ఎన్నికల సంగ్రామాన్ని ముమ్మరం చేద్దామని శ్రేణలకు జగన్
పిలుపునిచ్చారు.
సామాజిక పింఛన్ల పెంపు, వైఎస్సార్ చేయూత సాయం జనవరిలో
అందజేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, జగనన్న సురక్ష ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం
ఏర్పడుతుందన్నారు.