ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల దుశ్చర్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడి 260 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లోనే 260 మంది పౌరులు చనిపోయారని ఇప్పటి వరకు గుర్తించారు. తీవ్రవాదులు జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 700 మంది ఇజ్రాయెలీలు మరణించారు.
ఇజ్రాయెల్‌లో యూదులు ఈజిప్ట్ నుంచి వలస వచ్చిన సందర్భాన్ని స్మరించుకునేందుకు గాజా సరిహద్దు సమీపంలోని నెగెవ్ ఎడారిలోని ఓ సువిశాల ప్రాంగణంలో ట్రైట్ ఆఫ్ నోవా కంపెనీ, ది సూపర్ నోవా పేరుతో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వారం రోజులు సెలవు దినాలు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ మ్యూజిక్ ఫెస్ట్‌కు 3 వేల మంది హాజరయ్యారని తెలుస్తోంది.
మ్యూజిక్ పార్టీ జోరుగా సాగుతున్న సమయంలో హమాస్ తీవ్రవాదులు రాకెట్లతో విరుచుకుపడ్డారు. మ్యూజిక్ హోరులో కాసేపటిదాకా అక్కడి వారు గుర్తించలేకపోయారు. ఆ తరవాత ఎయిర్ డిఫెన్సు సైరెన్లు మోగడం, కరెంటు తీసివేయడంతో, 50 మంది మిలిటెంట్లు మ్యూజిక్ ఫెస్టివల్ ప్రాంగణంలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది.
ముష్కరుల కాల్పులతో ఆ ప్రాంతమంతా రక్తపుటేరులు పారాయి. జనాలు పరుగులు తీయడానికి కూడా వీలులేకపోవడంతో వందలాది మంది బలయ్యారు.కొందరు వాహనాల్లో పారిపోయే ప్రయత్నం చేసినా ఫలించలేదని అక్కడి నుంచి బయటపడ్డ ఏస్తర్ అనే వ్యక్తి వెల్లడించాడు. మరికొందరు చెట్లు, పొదల మాటన నక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడు గంటల సమయం తరవాత ఇజ్రాయెల్ సైన్యం రంగప్రవేశం చేసి మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కు 3 వేల మంది హాజరవుతారని హమాస్ ముందే అంచనా వేసిందని తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులు 100 మంది ఇజ్రాయెలీ పౌరులను కూడా కిడ్నాప్ చేశారు. వీరిలో ఇజ్రాయెల్ సైన్యంలోని ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.