ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.
230 సీట్లున్న మధ్యప్రదేశ్‌లో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ అలయెన్స్ 109 సీట్లు గెలుచుకున్నాయి. 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.జ్యోతిరాదిత్య సింధియా మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చుకుని బీజేపీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ మైనారిటీలో పడిపోయింది.
కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యేల మద్దతుతో అక్కడ శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2018 ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది.200 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. 73 సీట్లు బీజేపీ నెగ్గింది. ఇండిపెండెట్ అభ్యర్థుల సహకారంతో అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతున్నారు.
119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణలో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. 98 స్థానాలున్న చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బీజేపీ 15 సీట్లు గెలుచుకుంది. ఇక మిజోరంలోని 40 సీట్లలో, మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. అక్కడ బీజేపీ 5 సీట్లు గెలుచుకుంది. డిసెంబరులో ఈ ఐదు రాష్ట్రాలకు జరగబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.