ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు దిగిన హమాస్ తీవ్రవాద సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. రెండు రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఎదురు దాడిలో 400 మంది హమాస్ మిలిటెంట్లు చనిపోయినట్లు సైన్యం ప్రకటించింది. పలు పట్టణాల్లో హమాస్ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తోన్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి డానియేల్ హగరి ప్రకటించారు. దేశంలోని అన్ని నగరాల్లో సైన్యాన్ని మోహరించినట్లు ఆయన తెలిపారు.
గాజా సరిహద్దుల వెంట ప్రజలను ఖాళీ చేయిస్తోన్న ఇజ్రాయెల్ సైన్యం, అక్కడ దాడులు తగ్గించి, భద్రత పెంచారు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సైన్యం దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ తీవ్రవాదులకు మధ్య కిఫర్ అజాలో భీకరపోరు కొనసాగుతోంది. గాజా సరిహద్దు పట్టణాల్లో దాడులను ఇజ్రాయెల్ సైన్యం ముమ్మరం చేసింది. కనిపించిన ఉగ్రవాదులను కాల్చి చంపుతున్నారు.
హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో ఇప్పటి వరకు 300 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ జరిపిన ఎదురుదాడిలో 400 మంది హమాస్ తీవ్రవాదులు హతమయ్యారు. హమాస్ దాడులను త్వరలోనే అణచివేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆదివారం ఉదయం హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌లోని భూభాగాలను ఆక్రమించారు. హమాస్ క్రూరమైన యుద్ధాన్ని మొదలు పెట్టిందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.