కృష్ణా
డెల్టాకు కీలకమైన ప్రకాశం బ్యారేజీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ
సాగునీటి కట్టడంగా గుర్తింపు దక్కింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్
డ్రెయినేజీ సంస్థ, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజీని
గుర్తించింది.
వ్యవసాయ
రంగంలో సమర్థంగా నీటిని వినియోగించే వారసత్వ కట్టడాలను గుర్తించడానికి వాటిపై చేసే
పరిశోధనలు ప్రొత్సహించడానికి ఈ అవార్డును జారీ చేస్తారు.
నవంబర్ 2 నుంచి 8 వరకు
విశాఖలో నిర్వహించే ఐసీఐడీ 25వ కాంగ్రెస్ సమావేశాల్లో ఈ అవార్డును జలవనరుల శాఖకు
ప్రదానం చేస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం, రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది.
కృష్ణా
నదిపై ఆనకట్ట నిర్మించాలని సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదించడంతో 1850 జనవరి ఐదో తేదీన
ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు ఆమోదించింది. 1852లో ప్రారంభమైన ఆకనట్ట నిర్మాణం, 1855
నాటికి రూ. 1.75 కోట్లతో పూర్తి చేశారు. అప్పట్లో ఈ ఆనకట్ట ద్వారా 5.8 లక్షల
ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది.
కృష్ణా
నదికి 1952లో వచ్చిన భారీ వరదలకు ఆనకట్ట కొట్టుకుపోయింది.
దీంతో ఆనకట్ట స్థానంలో
1954 ఫ్రిబవరి13న బ్యారేజీ నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు
ప్రారంభించారు.
1957
డిసెంబర్ 24న నాటికి పునర్నిర్మాణం పూర్తికాగా ఇందుకోసం రూ. 2.78 కోట్లు ఖర్చు
చేశారు. బ్యారేజీ ఆయకట్టును 13.08 లక్షల ఎకరాలకు పెంచారు.
బ్యారేజీ
నిర్మించాక 1998లో 9.32 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2009 అక్టోబర్లో
అత్యధికంగా 11.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా బ్యారేజీ చెక్కుచెదరలేదు. రాతి
కట్టడం కావడంతోనే అంత పటిష్ఠంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి విడుదల స్థాయి
12 లక్షల క్యూసెక్కులు ఉండేలా ప్రకాశం బ్యారేజీని డిజైన్ చేశారు. ఇందు కోసం 70
గేట్లను ఏర్పాటు చేశారు.