ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వేలాది రాకెట్లతో విరుచుకుపడింది. తాజాగా మరో ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా గ్రూప్ కూడా హమాస్‌తో చేతులు కలిపింది. వందలాది హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులకు దిగారు. ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్‌హైట్స్ నుంచి హెజ్బొల్లా ఉగ్రవాదులు దాడులకు దిగారు.
ఇజ్రాయెల్‌పై దాడులను హెజ్బొల్లా అధికారికంగా అంగీకరించింది. భారీగా రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. జిబ్‌డెన్ ఫామ్, షీబీ ఫామ్స్ వద్ద దాడులకు దిగినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగడంతో ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.
హెజ్బొల్లా తీవ్రవాదుల దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. అయితే ఈ పోరులో ఎంత మంది చనిపోయారనే విషయం తెలియరాలేదు. హెజ్బొల్లా దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.