ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు దిగిన హమాస్ తీవ్రవాద సంస్థ సంచలన ప్రకటన చేసింది. తమ దాడులకు ఇరాన్ మద్దతు ఉందని ప్రకటించింది. హమాస్ ప్రతినిధి ఘాజీ హమీద్ ఈ ప్రకటన చేశారు. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తముందని ఇజ్రాయెల్ నమ్ముతూ వస్తోంది. హమీద్ ప్రకటనతో అది నిజమైంది. హమాస్ దాడిని ఇరాన్ సమర్థించింది. అది ఆత్మరక్షణ దాడిగా పేర్కొనడం విశేషం.
ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. హమాస్ దాడుల తరవాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడులను బ్లింకన్ ఖండించారు.తమ ప్రజలను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్ తెలిపింది. గాజా నుంచి హమాస్ జరుపుతున్న దాడుల నుంచి తమ దేశ ప్రజలను రక్షించుకుంటామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఇజ్రాయెల్ ప్రతినిధి గలీద్ ఎర్డాన్ ప్రకటించారు.