పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్ధాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య నెలకొన్న వివాదాలు, తీవ్రవాద సంస్థ హమాస్ దాడులతో మరోసారి పెచ్చుమీరాయి. యూదులకు సెలవుదినమైన శనివారంనాడు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులతో విరుచుకుపడ్డారు. వేలాది మంది హమాస్ తీవ్రవాదులు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి జొరబడ్డారు. ఒక్కసారిగా ఆకాశం, భూమి, సముద్రంపై నుంచి దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాన నగరాల్లో మెలిటెంట్లు తుపాకులతో రెచ్చిపోయారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలను చేశారు.
ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ తీవ్రవాదులకు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లోని 22 నగరాల్లో మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. మెరుపు దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ ఉలిక్కి పడింది. రెండు పట్టణాల్లో హమాస్ తీవ్రవాదులు వందలాది మందిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. రెండు రోజులుగా జరుగుతోన్న దాడుల్లో 500 మంది చనిపోయారు. 3200 మంది గాయపడ్డారు. వారిలో 79 మంది పరిస్థితి విషమంగా ఉందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అల్లాడుతోన్న ప్రపంచ దేశాలకు తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. 1973లో పాలస్తీనాతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లు అయిన సందర్భంగా హమాస్ తీవ్రవాదులు ఈ దాడులకు దిగినట్లు ప్రకటించారు.
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గాజా స్ట్రిప్ ప్రాంతం వివాదానికి ఆజ్యం పోసింది. శనివారం నుంచే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పట్టణాలపై రాకెట్లతో విరుచుకుపడ్డారు. జెరుసలేం, టెల్ అవీవ్ పట్టణాలు సహా దేశ వ్యాప్తంగా రాకెట్ల దాడులు జరిగాయి. సరిహద్దుల్లో జనం భయటకు రావద్దని ఇజ్రాయెల్ హెచ్చరించింది. శనివారం సాయంత్రం టెల్ అవీవ్ పట్టణంపై హమాస్ ఉగ్రవాదులు 150 రాకెట్లతో దాడులు చేశారు.
ఇజ్రాయెల్‌పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించినట్టు హమాస్ మిలటరీ హెడ్ మహమ్మద్ డెయిఫ్ ప్రకటించారు. ఆపరేషన్ ఆల్ ఆఖ్సా స్టార్మ్ మొదలైందని, ఇప్పటికే 5 వేల రాకెట్లు ప్రయోగించినట్టు డెయిఫ్ చెప్పిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పు జెరుసలేం, ఉత్తర ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా వాసులంతా ఈ యుద్ధంలో పాల్గొనాలంటూ డెయిఫ్ పిలుపునిచ్చారు.
హమాస్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ ప్రారంభించింది. గాజాలోని హమాస్ తీవ్రవాదుల స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 500 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. గాజాలో భారీ భవనాలను యుద్ధ విమానాలతో కూల్చి వేశారు. హమాస్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. యుద్ధం మొదలైనట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు తమ పూర్తి సహకారం ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అనేక దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రకటనలు చేశాయి.