ఇజ్రాయెల్
పై హమాస్ ఉగ్రవాద సంస్థ దాడికి దిగడంతో 22 మంది సామాన్య పౌరులు ప్రాణాలు
కోల్పోయారు. ఐదు వేల రాకెట్ల దాడిలో 300 మంది గాయపడగా 70 మంది పరిస్థితి విషమంగా
ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
దక్షిణ,
మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాల్లో శనివారం ఉదయం హమాస్, రాకెట్లతో విరుచుకుపడింది.
గాజాలోని ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఆకస్మికంగా విధ్వంసానికి పాల్పడటంతో
ఇజ్రాయెల్ పౌరులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోని ఓ నగర మేయర్
తో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు.
పలువురు
ఐడీఎఫ్ సైనికులతో పాటు సామాన్యులను ఉగ్రవాదులు అపహరించి బందీలుగా చేసుకున్నట్లు
వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇజ్రాయెల్
పై రాకెట్లతో విరుచుకుపడాలని హమాస్ అధినేత
మొహమ్మద్ డెయిఫ్ పిలుపు నివ్వడంతో మిలిటెంట్లు ఆపరేషన్ ఆక్సా స్ట్రామ్ ప్రారంభించారు.
ఇప్పటి వరకు 5 వేల రాకెట్లు ప్రయోగించినట్లుగా డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో బయటకు
వచ్చింది. కొంతకాలంగా అండర్ గ్రౌండ్ కు పరిమితమైన డెయిఫ్, తాజాగా విధ్వంసానికి పిలుపునివ్వడం
యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.
తమ దేశం
యుద్ధంలో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అధికారిక ప్రకటన విడుదల
చేశారు. శత్రువులపై ఆపరేషన్లు, కాల్పులు కాదు మేం యుద్ధం చేస్తున్నామని, తప్పకుండా
గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు చొరబడిన ప్రదేశాల్లో సామాన్యులను
సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భద్రతా దళాలను ఆదేశించానని, అదే సమయంలో ఉగ్రదాడిని
తిప్పికొట్టాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఇజ్రాయెల్
పై తీవ్రవాదుల క్రూరమైన దాడిని పలు దేశాధినేతలు ఖండించారు. తమ దేశానికి మద్దతుతో పాటు సానుభూతి తెలిపిన వివిధ దేశాలకు ఇజ్రాయెల్
ధన్యవాదాలు తెలిపింది.
భీకర
దాడుల కారణంగా దక్షిణ ఇజ్రాయెల్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో 10 లక్షల మంది
పిల్లలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది.
మిలిటెంట్ల
దాడిని తిప్పికొట్టే చర్యకు ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ గా నామకరణం చేసిన ఇజ్రాయెల్,
మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించింది.
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి నేపథ్యంలో భారత్
అప్రమత్తమైంది. ప్రవాస భారతీయులు జాగ్రత్తగా
ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో
+97235226748 కు కాల్ చేసి సహాయం కోరవచ్చు అని తెలిపింది. అలాగే cons1.telaviv@mea.gov.in కు మెయిల్ చేయాలని ఇజ్రాయెల్ లోని
భారత రాయభార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్ పై మిలిటెంట్ల దాడి వార్త తెలిసి తీవ్రదిగ్భ్రాంతి
చెందినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు భారత్
సంఘీభావం ప్రకటించింది.