పశ్చిమబెంగాల్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి
తనను కుట్టిన దోమలను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఈ విచిత్ర సంఘటన తూర్పు
వర్ధమాన్ జిల్లాలో శుక్రవారం బైటపడింది.
పశ్చిమ బెంగాల్లో డెంగీ కేసులు
పెరుగుతున్నాయి. ఆ క్రమంలో మంగళకోట్‌లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్.. తనను
కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డెంగీ కేసులతో ఆందోళన చెందిన
మన్సూర్.. భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్‌లో వేసి ఆసుపత్రికి
తీసుకొచ్చాడు.
ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్
అలీ మన్సూర్‌ను చూసి ఎమర్జెన్సీ కేసు అనుకున్నాడు. కానీ అతని బ్యాగులో దోమలను చూసి
వైద్యుడితోపాటు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
దోమలను ఆస్పత్రికి తీసుకువెళ్ళడానికి
కారణాన్ని మన్సూర్ వివరించాడు. ‘నా దుకాణం దగ్గర నీళ్ళు నిలవ ఉండిపోయాయి. ఆ
చుట్టుపక్కల దోమల బెడద ఎక్కువగా
ఉంది. వాటి నుంచి రక్షించుకోడానికే
నన్ను కుట్టిన దోమలను చంపాను. డాక్టర్లు ఆ దోమలను పరీక్షించి సరైన వైద్యం
అందిస్తారని, వాటిని కవర్లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాను’ అని చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనపై మంగళకోట్ అధికారి స్పందిస్తూ,
తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని చెప్పారు. ఆ విషయాన్ని బ్లాక్ మెడికల్
ఆఫీసర్, బ్లాక్ డెవలప్మెంట్
ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు
చేపడతామన్నారు. మురుగుకాలువను శుభ్రం చేయిస్తామన్నారు. దోమల నివారణ మందులను, బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ
చేస్తామన్నారు.