కృష్ణా
నదిపై ప్రధాన జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు,
ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ
నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన సమావేశంలో, బోర్డు చైర్మన్ శివనందన్
కుమార్, కన్వీనర్ డీఎం రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ
మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలం
నుంచి ఏపీకి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలు కేటాయించగా, తెలంగాణకు 35
టీఎంసీలు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న జలాల్లో సాగునీటికి ఇరు రాష్ట్రాల వాటాలు 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ ఈఎన్సీ
నారాయణరెడ్డి పట్టుబట్టగా తెలంగాణ అంగీకరించలేదు.
వర్షాభావ
పరిస్థితులతో రిజర్వాయర్లకు ప్రవాహాలు ఆశించినంత రాకపోవడంతో ఉన్న నిల్వల్లో
తాగునీటికి మాత్రమే కేటాయింపులు చేయనున్నట్లు బోర్డు పేర్కొంది.
45
టీఎంసీలకు ఏపీ, 52 టీఎంసీలకు తెలంగాణ ఇండెంట్ సమర్పించాయి. దీంతో 97 టీఎంసీల నీరు
అవసరం. రెండు జలాశయాల్లో 65 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో నాగార్జున సాగర్ లో ఎండీడీఎల్ స్థాయి 510 అడుగులకు బదులు 505 అడుగుల నుంచి
27.53 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగుల నుంచి కాకుండా 805 అడుగుల నుంచి 55.26
టీఎంసీలు తీసుకోవాలని నిర్ణయించారు.
రెండు జలాశయాల్లో కలిపి 82.79 టీఎంసీలు
తీసుకునేందుకు అంగీకరించారు.
రెండు
రాష్ట్రాలకు 80 టీఎంసీలు కేటాయించగా మిగిలిన 2.78 టీఎంసీలతో పాటు ఎగువ నుంచి వచ్చే
ప్రవాహాలను నిల్వ ఉంచాలని బోర్డు ఆదేశించింది.