ఎయిర్ ఇండియా కొత్త యజమాని టాటా గ్రూప్,
ఇటీవల సంస్థ చిహ్నం, విమానాల రూపురేఖల్లో మార్పులు చేసింది. ఈ విమానాల ఫస్ట్ లుక్‌ను
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్రాన్స్‌లోని టౌలోసి వర్క్‌షాప్‌లో
కొత్త లోగో, డిజైన్‌తో సరికొత్తగా తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను
ఎయిరిండియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ శీతాకాలంలో ఏ350 విమానాలను భారత్ తీసుకురానున్నట్లు
తెలిపింది.
‘ది విస్టా’ అని పిలిచే కొత్త లోగోలో బంగారు
రంగు మహారాజా మస్కట్ విండో ఫ్రేమ్‌ను ఉంచారు. అపరిమిత అవకాశాలు, ప్రగతిశీలత, భవిష్యత్తుపై
విమానయాన సంస్థకు ఉన్న విశ్వాసం, ధైర్యానికి సంకేతంగా ఈ కొత్త లోగోను రూపొందించినట్లు కంపెనీ
తెలిపింది. లోగో కోసం ‘ఎయిర్ ఇండియా శాన్స్’ అనే కొత్త ఫాంట్‌ను డిజైన్ చేశారు.
విమానాల డిజైన్‌ను ఎరుపు, ఊదా, బంగారు రంగు డిజైన్లతో మార్చారు.
ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లోని పాత
విమానాలన్నింటినీ ఈ కొత్త డిజైన్లోకి మారుస్తామని సంస్థ ప్రకటించింది. ఇందుకోసం 40 కోట్ల డాలర్లు
ఖర్చవుతుందని సమాచారం. 2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలను కొత్త లోగోలోకి
మార్చనున్నట్లు కంపెనీ తెలిపింది.